జీతాల కోసం గవర్నర్ ను కలిసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు
ఏపీలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 11వ పీఆర్సీ ఆర్థిక నష్టాలను ప్రభుత్వం ఏదో విధంగా పూడ్చుతుందన్న ఆశతో ఉన్నామని అయితే పరిస్థితలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని, రావాల్సిన జీతాలు నెల నెలా ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్ ఖాతాల నుంచి కుటుంబ అవసరాల కోసం సొమ్ము డ్రా చేసుకునే అవకాశాలు కూడా లేవని ఇప్పటికైనా సకాలంలో జీతాలు ఇప్పించాలంటూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ను ఉద్యోగ సంఘం నేతలు కోరారు. రాజ్ భవన్ లో గురువారం గవర్నర్‌ను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి పత్రం అందజేశారు. ప్రతినెల 1వ తేదీన అన్ని రకాల ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించేలా చట్టం చేయాలని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఫైనాన్షియల్ కోడ్ లోని 72వ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మొదటి హక్కుదారుగా ఉద్యోగుల పెన్షనర్ల జీతభత్యాలు ఇతర చెల్లింపులు చేర్చాలని గవర్నర్‌ను వారు కోరారు. ఈ మేరకు ఉద్యోగాలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

అనంతరం రాజ్ భవన్ వెలుపల సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ విధి లేని పరిస్థితుల్లోనే గవర్నర్ ను కలిసి సమస్యలు వివరించామన్నారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రివర్గ ఉప సంఘం చివరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యల పరిష్కారం కాలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక సర్వీసు పరమైన అంశాలు పరిష్కరించాలంటూ గవర్నర్‌ను కలిసామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించటం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతి నెల మొదటి తారీఖున ఉద్యోగుల జీతభత్యాలను ఇవ్వాలని ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండానే 90 వేల మంది ఖాతాల నుంచి జిపిఎస్ నగదును విత్ డ్రా చేసినట్లు తెలిపారు. అదేమని తాము ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య అంటూ అధికారులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం మేరకు ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈలోగా జిల్లాల వారీగా ఉద్యోగులను సమాయత్తం చేయనున్నామని తెలిపారు.