Andhra PradeshHome Page Slider

అరెస్టుకు సిద్ధం… చేసుకోండంటూ జగన్ సర్కారు కోటంరెడ్డి సవాల్

గొంతు ఆపాలంటే ఎన్‌కౌంటర్ ఒక్కటే పరిష్కారం
మాజీ మంత్రి అనిల్‌, సజ్జలపై కోటంరెడ్డి ఫైర్
అనిల్, వివేకాకు నమ్మక ద్రోహం చేయలేదా?
ఏ పార్టీలో చేరితే మీకేంటని వైసీపీకి కౌంటర్
సజ్జలను ఓ రేంజ్‌లో ఆడుకున్న కోటంరెడ్డి
అమెరికా అడ్వైజర్‌ అంత తెలివుందని ఎద్దేవా
ఇసుకాసురులపై మాట్లాడితే ఉద్యోగం ఊస్ట్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర్నుంచి మంత్రుల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా తూర్పారబట్టారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నప్పటికీ… తప్పు చేసిన వ్యక్తులంతా తనను విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర హోం శాఖతో రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఫోన్‌లో మాట్లాడిన తన స్నేహితుడు ఫోన్ రికార్డ్ చేశానని కూడా చెప్పే అవకాశం లేకపోలేదన్న కోటంరెడ్డి, కేంద్ర హోంశాఖతో విచారిస్తే… జగన్‌ను శభాష్ అంటానని అన్నారు. పార్టీలో ఉండలేనంటూ తాను మాట్లాడాక… ఐదు రోజుల నుంచి ప్రభుత్వ పెద్దలంతా విమర్శలు గుప్పిస్తున్నారని.. మరీ ముఖ్యంగా బంధుత్వానికంటే ఎక్కువగా కలిసిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో విమర్శించడం హేయమన్నారు.

రక్తసంబంధానంటే అనిల్ కుమార్ యాదవ్‌తో తనకు రిలేషన్ ఉందని కానీ కుటుంబం సభ్యులను విమర్శించడం దారుణమన్నారు. జగన్‌కి ద్రోహం చేసిన నాకు, నా బిడ్డలకు శాపం తగులుతుందని వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు కోటంరెడ్డి. నమ్మకద్రోహమంటే అసలేంటని ప్రశ్నించారు. నిజంగా తాను నమ్మకద్రోహం చేసి ఉంటే.. ఆ భగవంతుడు, ప్రకృతి తగిన శిక్ష విధించాలని కోరుతున్నానన్నారు. అనుమానించి, అవమానిస్తే, మౌనంగా కూర్చోలేనన్నారు. తాను గానీ జగన్మోహన్ రెడ్డికి నమ్మక ద్రోహం చేసి ఉంటే, ర్మర్గపు కుట్ర నేను చేసి ఉంటే… సర్వనాశనం చేయాలని ఆయన దేవుడ్ని కోరుతున్నానన్నారు. ఓదేవుడా నన్ను నువ్వు శిక్షించాలంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. నిఖార్సుగా ప్రజలకు మేలు చేయాలని బతికానన్న కోటంరెడ్డి… నమ్మకద్రోహం లాంటి పెద్ద మాటలు వద్దని అనిల్ కుమార్ యాదవ్‌కు హితవు పలికారు.

రాజకీయంగా అనిల్ కుమార్ యాదవ్ ఎలా ఎదిగాడో మర్చిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008లో నీకు కార్పోటర్ టికెట్ ఎవరిచ్చారని ప్రశ్నించారు. 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన ఆనం వివేకానంద రెడ్డి అవునో… కాదో చెప్పాలన్నారు. ఆయన ఇంటికెళ్లి తేల్చుకుంటానని మాటలు మాట్లాడలేదా అంటూ మండిపడ్డారు. రాజకీయాలకు సంబంధం లేని బిడ్డల గురించి ఎందుకు మాట్లాడతావంటూ విరుచుకుపడ్డారు. తనను అవమానించి, అనుమానించిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి.. అలా అడుగుతా.. ఇలా అడుగుతానని తాను అనలేదన్నారు కోటంరెడ్డి. ముందుగా పార్టీ నుంచి బయటకు వెళ్లి కోటంరెడ్డి మేలు చేశాడని సజ్జల మాట్లాడి విజ్ఞత చూపించారంటూనే ఆయన తీరును తూర్పారబట్టారు. క్రిస్మస్ రోజు చంద్రబాబును కలిశానంటూ కట్టుకథలు ప్రసారం చేస్తున్నారన్న కోటంరెడ్డి.. పార్టీలోంచి బయటకు రావాలనుకున్న తర్వాత ఎవరినైనా కలిసే స్వేచ్ఛ తనకు ఉందన్నారు.

థియేటర్ల యజమానుల నుంచి 2 లక్షలు వసూలు చేస్తున్నానంటూ ఓ ఆడియో క్లిప్ సజ్జల మాటలను నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారని.. అసలు ఇదేలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సజ్జలకు మతి ఉండే ఆ పని చేస్తున్నాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద గ్రేట్ గవర్నమెంట్ అడ్వైజర్… అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉండాల్సిన వ్యక్తి అంటూ సజ్జలను, కోటంరెడ్డి దెప్పిపొడిచారు. కరోనా తర్వాత రాయితీలు కావాలని థియేటర్ల యజమానులు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నారో తెలియదా అంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక పేరుతో, మద్యం పేరుతో జరుగుతున్న దందాలను అరికట్టేందుకు ఆడియోలు విడుదల చేయాల్సిందిగా కోటంరెడ్డి కోరారు. ఇసుకాసురులపై మాట్లాడితే సలహదారు పోస్టులు ఊడిపోతాయంటూ సజ్జలను ఉద్దేశించి మాట్లాడారు.

ఓవైపు విమర్శలు చేస్తూనే మరోవైపు కోటంరెడ్డి అరెస్టుకురంగం సిద్ధం.. అంటూ అధికార పార్టీ నేతలు కవ్విస్తున్నారని దుయ్యబట్టారు. రండి.. అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇవాళ, రేపా, ఇప్పుడో తేల్చుకోవాలని సవాల్ విసిరిరారు. మీడియాకు లీకులివ్వడం వల్ల ఒరిగేదేముందున్నారు. అరెస్ట్ చేసి శాశ్వతంగా జైళ్లో పెట్టండి.. జార్జ్ ఫెర్నాండేజ్‌లా… తాను కూడా జైళ్లో ఉండి ప్రజల అభిమానాన్ని చూరగొంటానన్నారు. జైలు అని చెప్పిన వెంటనే గజగజ వణికిపోతానని, భయపడిపోతానని అనుకున్నారని… తనది అలాంటి కేరెక్టర్ కాదని.. వైసీపీకి పంచ్‌లు విసిరాడు. వైసీపీ వద్దనుకొనే తాను బయకు రావాలనుకున్నానన్న ఆయన… తాను అన్నింటికీ ప్రిపేర్ అయి ఉన్నానన్నారు. ఒకవేళ నా గొంతు వినకూడదనుకుంటే ఎన్‌కౌంటర్ చేయడమొక్కటే పరిష్కారమన్నారు. అప్పుడు మాత్రమే తన గొంతు మూగబోతుందన్నారు. కొత్తగా నెల్లూరు రూల్ బాధ్యతలు చేపట్టిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి కోటంరెడ్డి ఆల్ ద బెస్ట్ చెప్పారు.