Home Page SliderTelangana

ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఖమ్మం వాసుల్ని కోరిన కిషన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ బీజేపీనే.. తెలంగాణ ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రజల పోరాటం మరువలేనిది ఆ విషయం మనందరికి తెలుసునన్నారు. ఉద్యమంలో కేసీఆర్ చేసిన దీక్షను బట్టబయలు చేసింది ఖమ్మం ప్రజలేనన్నారు. ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో అనేక మార్పులు జరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు.. ఒకసారి కాంగ్రెస్‌​తో ఇంకోసారి వేరే పార్టీతో కలిసి అస్తిత్వం కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీఆర్​ఎస్‌​తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఏదో ఒక పార్టీతో కలవాల్సిన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరిపైన పోరాటం చేయాలో.. వాళ్లపై చేయకుండా..వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్రంలోని బీఆర్​ఎస్​ పార్టీకి కొమ్ముకాస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో అధికార పార్టీ విచక్షణా రహితంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. చివరకు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉంటే.. ఆయనతో రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్నారన్నారు. దీనిపై కమ్యూనిస్టు పార్టీ కేడర్​.. పార్టీ పెద్దలను నిలదీయాలన్నారు కిషన్ రెడ్డి.

12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​ పార్టీలో చేరారని… ఈరోజు రాష్ట్రంపై ఒక కుటుంబ పాలన, పెత్తనం, ఆధిపత్యం ఉన్నాయన్నారు. ఒక కుటుంబ అహంకారం రాష్ట్రాన్ని పాలిస్తోందని ధ్వజమెత్తారు. దీన్ని ఖమ్మం ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్​ గద్దె దిగడంతోపాటు, మౌలిక మార్పులు రావాలన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండూ ఒకటేనన్న కిషన్ రెడ్డి, అనేక సార్లు అవి పొత్తు పెట్టుకున్నాయన్నారు. రెండు పార్టీల డీఎన్​ఏ ఒక్కటేనన్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే.. బీఆర్​ఎస్​ పార్టీ, కాంగ్రెస్‌​కు మద్దతు ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ఇటీవల బీఆర్​ఎస్​ మంత్రి మాట్లాడుతూ.. తాము కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని అన్నాడు. ఇది పగటికలే అయినప్పటికీ.. కాంగ్రెస్​ నేతృత్వంలో ప్రతిపక్ష కూటమితో వాళ్లు కలుస్తారనే అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్​ పార్టీని ఎన్నుకుంటే.. ఎన్నికల ముందు లేదా.. ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్‌తో కలుస్తారన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే గూటి పక్షులన్నారు. కుటుంబ, అవినీతి, అప్రజాస్వామి పోవాలనుకునే సమాజం ఆలోచించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్​, ఇప్పటి వరకు బీఆర్​ఎస్​ పార్టీల పాలన చూశాం.. కాబట్టి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానన్నారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చగలదని ఆయన చెప్పారు.

.