InternationalNews

వేలానికి కింగ్ చార్లెస్ వెడ్డింగ్ కేక్ పీస్

కింగ్ చార్లెస్-3, యువరాణి డయానాల వివాహం 1981లో జరిగింది. వారి వివాహం జరిగి ఇప్పటికి 41 సంవత్సరాలు అవుతుంది. అయితే వారి వివాహం నాటి కేక్ పీస్‌ను వేలం వేస్తున్నట్లు ఓ ప్రముఖ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ వివాహానికి హాజరైన ఓ అతిథి 41 సంవత్సరాలుగా ఈ కేక్ పీస్‌ను భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. బ్రిటన్ కొత్త రాజు కింగ్ చార్లెస్-3,యువరాణి డయానాల వివాహం నాటి కేక్ పీస్‌ను త్వరలో వేలం వేయనున్నారు. 1981వ సంవత్సరంలో 3000 మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి వచ్చిన అతిథులలో ఒకరైన నిగెల్ రికెట్స్  గతేడాది మరణించారు. అయితే ఆయనకు సంబంధించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అదేంటంటే ఆయన గత 41 ఏళ్లుగా ఆ వివాహానికి సంబంధించిన ఓ కేక్ పీస్‌ను చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. దీంతో ఆ కేక్ పీస్‌ను ఓ ప్రముఖ సంస్థ డోర్ అండీ రీస్ వేలం వేయనుందని న్యూయార్క్ పోస్ట్ ప్రకటించింది. ఈ వేలం 300 పౌండ్లతో(దాదాపు రూ.27 వేలు) ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే ఈ కేక్ పీస్ మోస్ట్‌పాపులర్ వెడ్డింగ్‌కు చెందింది కావడంతో అంచనాలను మించి ధర పలికే అవకాశాలు ఉన్నాయని వార్తాసంస్థ పేర్కొంది. నాడు వివాహంలో చార్లెస్ దంపతులు మొత్తం 23 కేకులను కట్ చెయ్యగా.. ఇది ఫ్రూట్ కేక్‌లోని పీస్ ‌అని గుర్తించారు. వారి వివాహానికి సంబంధించిన ఓ కేక్ పీస్‌ను 2014లో ఇదే సంస్థ వేలం వేసింది. కాగా అప్పట్లోనే ఆ కేక్ పీస్ 1375 పౌండ్లు (దాదాపు 1.27 లక్షలు)పలికింది.