కేసీఆర్ మనవడ్ని కదా, అందుకే ఇంత బాధ్యత తీసుకున్నా…
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడైన హిమాన్షు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాల ఆధునికీకరణ పనులను తాను సేకరించిన నిధులతో నిర్మించారు. తాను కేసీఆర్ మనవడిని కాబట్టే ఇంత బాధ్యత తీసుకున్నానంటూ చాలా పవర్ ఫుల్‌గా ప్రసంగించారు హిమాన్షు. తన తొలి పబ్లిక్ స్పీచ్ ఇదేనంటూ క్లారిటీ ఇచ్చారు. మొదటి సారిగా మాట్లాడుతున్నా కూడా కుటుంబంతో మాట్లాడుతున్నట్లే ఉందన్నారు. తన స్నేహితులతో, తన స్కూల్ టీచర్లతో కమిటీని ఏర్పాటు చేసి, ఈ ప్రభుత్వ పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దారు హిమాన్షు. తనకు మార్కులు తక్కువ వచ్చినా పరవాలేదు, తోటి పిల్లల కోసం మంచి చేయగలిగితే చాలు అని తన తండ్రి కేటీఆర్ తనను ప్రోత్సహించారని, తాత కేసీఆర్ మాటలు ఎప్పుడూ తనకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. తాను మొదటి సారి ఈ స్కూల్‌కి కేవలం ఒక మొక్కలు నాటే కార్యక్రమానికే వచ్చానని, కానీ తనకు అది సంతృప్తి నివ్వలేదని, దయనీయ స్థితిలో ఉన్న ఈ స్కూల్ భవనం, బాత్‌రూమ్‌లు తనను కలచి వేసాయని, అందుకే ఈ స్కూల్ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని, ఆధునికంగా తీర్చిదిద్దామని తెలియజేశారు.