కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ
ఉత్కంఠకు తెర వీడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చాన్నాళ్లుగా కవిత అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారానికి నేడు ఈడీ తెరదీసింది. ఆమెను బంజారాహిల్స్ నందినగర్ లో ఈడీ అదుపులోకి తీసుకొంది. కవితను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ధ్రువీకరించారు. కవిత నివాసంలో ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు మొబైల్ ఫోన్లను సైతం అధికారులు తీసుకొని విచారణ కొనసాగించారు. అధికారులు సోదాలకు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. కవితను అరెస్ట్ చేయాలన్న సింగిల్ పాయింట్ అజెండాతో అధికారులు వచ్చారని.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామలో ఇప్పటికే కవితను అనేక సార్లు ఈడీ విచారించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే నాడు ఈడీ కేవలం విచారించి ఆమెను అరెస్ట్ చేయలేదు. అదే సమయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఈడీ పాటించింది.

అయితే రేపు లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తున్న సమయంలో… కవిత అరెస్ట్ తో బీఆర్ఎస్ పార్టీ డీలా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్టుతో మరింత దెబ్బతినే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలో ఆప్ మంత్రులను అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సైతం విచారించాలని ఈడీ భావిస్తున్నప్పటికీ.. ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. కేసులో కవిత ప్రమేయంపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లైలను ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. వీరందరూ సౌత్ గ్రూప్‌లో భాగమని ED ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ₹100 కోట్ల విలువైన లంచాలు ఇచ్చారని అభియోగాలున్నాయి. BRS MLC కవితను ప్రశ్నించిన తర్వాత, ED మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆమె మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్లను కూడా విచారించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసులో అవకతవకలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది.

కవితను నిందితురాలిగా చేర్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సోదాలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు తమ ముందు హాజరు కావాలని ఐటీ, ఈడీ కవితకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో అప్పీలు చేసి ఏజెన్సీల ముందు హాజరుకాలేదు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు చెల్లించిన సౌత్ గ్రూప్‌లో భాగమని ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే ఆరోపణలను కవిత ఖండించారు. ED నోటీసులను “మోడీ నోటీసులు” అని అభివర్ణించారు. చివరికి, డిసెంబర్ 1, 2022 న, సిబిఐ అధికారుల బృందం ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నివాసంలో కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. సీబీఐ బృందం ఏడు గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంది. డిసెంబరు 2, 2022న, ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించుకున్న ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణకు సంబంధించి డిసెంబర్ 6న విచారణలో పాల్గొనాల్సిందిగా సిబిఐ సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద ఎంఎల్‌సికి నోటీసు జారీ చేసింది. నవంబర్ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో తన పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కవితపై అందరి దృష్టి పడింది.

