కేసీఆర్.. ముందు నాపై గెలువు
బీఆర్‌ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ పగటి కలలు కంటున్నారని.. ఆయనకు దమ్ముంటే ముందు మునుగోడులో తనపై పోటీ చేసి గెలవాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌తో ఎన్నికల బరిలోకి దిగితే కేసీఆర్‌కు వీఆర్‌ఎస్ తప్పదని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ నాయకులిచ్చే డబ్బులు తీసుకుంటారని.. ఓటు మాత్రం బీజేపీకే వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికతోనే కేసీఆర్‌కు ప్రజలు చరమగీతం పాడతారని అభిప్రాయపడ్డారు.

స్థాయికి మించి మాట్లాడుతున్న కేసీఆర్..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలోనే అధికారాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజల దృష్టిని మరల్చడం కేసీఆర్‌కు అలవాటేనని.. ఈసారి మాత్రం ఆ పాచిక పారదని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎన్ని పథకాలు ప్రకటించినా.. ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఎన్నికల కోసమే అనే విషయం తెలిసిన ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను లైట్‌గా తీసుకుంటున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్ నాయకుల బ్లాక్ మెయిల్..
టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే పథకాలు లభిస్తాయంటూ ప్రజలను ఆ పార్టీ నాయకులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో ఉంటేనే కొత్త పెన్షన్లు ఇస్తామంటూ అకౌంట్‌లో వేసిన డబ్బులను ఫ్రీజ్ చేయడంపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇక్కడి ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మునుగోడులో ఎగరేది బీజేపీ జెండా అని ధీమా వ్యక్తం చేశారు.