“ట్యాంకుబండ్ ఖాళీ చేసి కొబ్బరినీళ్ళతో నింపుతామని” చెప్పిన కేసీఆర్‌వన్నీ అబద్దాలే
భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానని, ట్యాంక్ బండ్ ఖాళీ చేసి కొబ్బరినీళ్లతో నింపుతానని’ చెప్పిన మాటలన్నీ అబద్దాలేనన్నారు. నగరంలో పూర్తిగా డ్రైనేజ్ సమస్య ఉందన్నారు. మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, పార్కుల సమస్య, వీధిదీపాల మరమ్మత్తులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇన్ని సమస్యలు ఉంటే హైదరాబాద్‌ను న్యూయార్క్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా అంటూ కేసీఆర్ అబద్దాలు చెప్తున్నాడని విమర్శించారు. అంబర్ పేట పటేల్ నగర్ లో పాదయాత్రగా బయలుదేరి వివిధ కాలనీల మీదుగా ప్రేమ్ నగర్ , ముసారం బాగ్ బ్రిడ్జ్ వరకు పరిశీలించారు కిషన్ రెడ్డి. ప్రజలు తనదృష్టికి తెచ్చిన వివిధ సమస్యల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. మరో రెండురోజుల పాటు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చిన్నపాటి వర్షానికి నగర ప్రజలు ఉలిక్కిపడుతున్నారు అని, ప్రభుత్వం వెంటనే స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సత్వర చర్యలు చేపట్టాలి. హైటిక్ సిటీ, మధాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఫ్లైఓవర్లు కడుతూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. నిజమైన హైదరాబాద్ బస్తీలను, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్, మీరు అధికారంలో ఉండే మూడు నెలలైన పాత నగరాన్ని అభివృద్ధి చేయండి అంటూ విచారం వ్యక్తం చేశారు. నగర పరిస్థితిపై మాట్లాడుతూ “GHMC వాటర్ వర్క్స్ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. డ్రైన్ ల పూడిక తీసే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సకాలంలో బిల్లులు చెల్లించక పనులు ఆగిపోయాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కూడా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. రాష్ట్ర ఆదాయం లో 80శాతం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని దానిలో కనీసం ఈ నగరానికి 8 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. GHMC ఎలక్షన్ లో అనేక హామీలు ఇచ్చారు. ఫ్రీ డ్రింకింగ్ వాటర్, వివిధ టాక్స్ లను రద్దు చేస్తామని కానీ అవి అమలు చేయట్లేదని” విమర్శించారు.