వివిధ రాష్ట్రాల రైతులతో కేసీఆర్ సమావేశం
తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ఓ వినూత్న సమావేశాన్ని నిర్వహించారని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయ్. దేశం నలుమూలల నుంచి… దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రైతులతో కేసీఆర్ సమావేశమయ్యారని వివరించాయ్. ఉదయం నుంచి రాత్రి దాకా రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగింది. ప్రగతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రైతులతో కేసీఆర్ ఉత్సాహంగా పలు అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ పరిస్థితులు, పద్దతులు, ఆయా ప్రభుత్వాల నుంచి అందుతున్న మద్దతు, సాగులో నూతనంగా అందివస్తున్న సాంకేతికత తదితరాలపై కేసీఆర్ చర్చించారని అధికారులు తెలిపారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న కార్యక్రమాలను కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతులకు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుబంధు పేరిట దేశంలోనే రైతులకు ప్రభుత్వం నుంచి తొలిసారిగా పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. ఇవాళ కూడా రైతులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయం రంగ అభివృద్ధి, రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు ‘జాతీయ రైతు ఐక్యవేదిక’ ఏర్పాటు కావాలని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశం ముక్తకంఠంతో తీర్మానించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయ్.
