బనకచర్ల ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆరే…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఆపడం లేదని, రాష్ట్రాభివృద్ధి లో సహకరించకుండా రాజకీయ లాభాల కోసం వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలా ల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై ఎంపీల తో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివరించామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు కేసీఆర్ చొరవతోనే ప్రారంభమైందని, అప్పటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలే దానికి కారణమని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అవసరమైన నీటిని రైతులకు అందించలేకపోయారని మండిపడ్డారు. హరీష్ రావుపై కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, ప్రజల బాధలపై చులకన వైఖరిని అనవసరంగా ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు అవసరమైతే ప్రధాని మోదీని కూడా కలుస్తామని, అవసరమైతే కోర్టుకు సైతం వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. 968 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణకు పూర్తి అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

