ఒకే వేదికపై కేసీఆర్, చంద్రబాబు..?
వాళ్లిద్దరూ తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న రాజకీయ ఉద్ధండులు. గతంలో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఒకరినొకరు ముఖం చూసుకునేందుకే ఇష్టపడటం లేదు. ఒకరిపై మరొకరు ఎత్తుకు పైఎత్తుతో రాజకీయంగా దెబ్బ కొట్టేందుకూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటదా? అనే పరిస్థితి నెలకొంది. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానంలో ఉన్న ఈ ఇద్దరు రాజకీయ నాయకులు ఒకే వేదికపై దర్శనం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వేదిక తెలుగు రాష్ట్రాల్లో కాదు.. హర్యానాలో..! టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడులకు ఈ నెల 25వ తేదీన హర్యానాలో కలిసి ఒకే సభలో పాల్లొనే అవకాశం ఏర్పడింది.

మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా నిర్వహించే సభలో పాల్గొనాలని కేసీఆర్, చంద్రబాబులకు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు అభయ్ చౌతాలా ఆహ్వానం పంపించారు. ఈ సభకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్, మేఘాలయా గవర్నర్ సత్యపాల్ మాలిక్ తదితరులను కూడా ఆహ్వానించినట్లు చౌతాలా చెప్పారు. ఈ సభ బీజేపీకి వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. విపక్షాల ఐక్యతను చాటేందుకు ఈ సభ వేదిక అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.