InternationalNews

అమెరికాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కాట్రగడ్డ అరుణ ఘన విజయం

అమెరికాలో ప్రవాస భారతీయులు పాగా వేయడం నిరాఘాటంగా కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ విజయం సాధించారు. తాజాగా మేరీల్యాండ్‌ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన కాట్రగడ్డ అరుణ మిల్లర్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఘన విజయం సాధించారు. కృష్ణా జిల్లాలోని వెంట్రప్రగడలో జన్మించిన అరుణ కుటుంబం 1972లోనే అమెరికాకు వలస వెళ్లింది. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఐబీఎంలో పని చేశారు. మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన అరుణ 1990లో మోంట్‌గోమెరీ కౌంటీకి షిఫ్ట్‌ అయ్యారు. తన స్నేహితుడు డేవిడ్‌ మిల్లర్‌ను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమార్తెలు.

గవర్నర్‌గా నల్ల జాతీయుడు..

మేరీల్యాండ్‌ గవర్నర్‌గా కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వెస్‌ మూర్‌ ఎన్నికయ్యారు. మేరీల్యాండ్‌ నుంచి ఈ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా వెస్‌ మూర్‌ నిలిచారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన రిపబ్లికన్‌ అభ్యర్థి డాన్‌ కాక్స్‌ను 2-1 తేడాతో ఓడించారు. రిపబ్లికన్లకు కంచుకోట అయిన మేరీల్యాండ్‌లో డెమోక్రటిక్‌ పార్టీ పట్టు సాధించడం విశేషం. గవర్నర్‌ వెస్‌ మూర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అరుణ మిల్లర్‌ ఇద్దరూ వలసవాదుల కుటుంబానికి చెందిన వారే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.