Home Page SliderInternational

ట్రంప్‌కు కమలా హారిస్ షాక్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అక్కడి పోల్ సర్వేల ప్రకారం నిన్న మొన్నటి వరకూ ముందంజలో ఉన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు షాక్ తగలనుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. కమలా హారిస్‌ భారత సంతతి వ్యక్తి కావడం, అక్కడ భారతీయుల మద్దతు ఎక్కువగా కూడగట్టడంలో సఫలం చెందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచం మొత్తం చూపు అటే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం ఉండడం వల్ల పలు సంస్థలు అక్కడ సర్వేలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 5న జరగబోయే ఈ ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. విరాళాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ రేసు నుండి తప్పుకుని కమలాహారిస్ పేరు ప్రకటించిన కొద్ది కాలంలోనే డెమొక్రటిక్ పార్టీకి భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. భారీ సంఖ్యలో ఆమె సభలకు ప్రజలు హాజరవుతున్నారు. గత నెలలో ట్రంప్‌పై హత్యాయత్నంతో ఆయనకు విజయావకాశాలు పెరిగినట్లు అనిపించినా, తాజా పరిణామాలతో పలువురు మాజీ అధ్యక్షుల మద్దతుతో కమలా హారిస్, ట్రంప్‌ను వెనక్కునెట్టారు. సెప్టెంబరులో వీరిద్దరి మధ్య పబ్లిక్ డిబేట్ జరగనున్నట్లు సమాచారం.