NationalNews

జోడీల జైత్రయాత్ర…


ఆ ఇద్దరే.. దేశ గతిని మార్చిన యోధులు. ఆ ఇద్దరే.. ఓ చరిత్రకు బాటలు వేసిన మేధావులు. ఆ ఇద్దరే.. ఓ రాజకీయ శక్తికి ఊపిరులూదిన కార్యశూరులు. ఆ ఇద్దరే.. కాంగ్రెస్ ను కూకటి వేళ్ళతో పెకలించిన శక్తివంతులు. దేశ రాజకీయ యవనికపై వారి ప్రస్ధానం అమేయ త్యాగ సమ్మిళితం. వారి అధ్యాయం ఓ ఉత్తుంగ తరంగం. ఇద్దరూ ఇద్దరే. సకల విజ్ఞాన సంపన్నులు. సమస్త విషయ పారంగతులు. బహు భాషా కోవిదులు. అంతకు మించి తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కట్టుబడ్డ నిఖార్సైన, నిండైన రాజకీయ వేత్తలు. దేశమాత నుదుటను దిద్దిన చందన సింధూరాలు. వారేసిన బాటలే ఇప్పుడు కమలనాధులకు మార్గదర్శకాలు. వారి జీవితాలు ఎందరికో స్ఫూర్తిదాయకాలు. మనుషులు వేరైనా వారి మనసులు ఒకటే. దేహాలు వేరైనా వారి ఆలోచన ఒకటే. ఇప్పుడు దేశంలో జైత్రయాత్ర చేస్తున్న కమల పతాకానికి దిశా నిర్దేశం వారే. బీజేపీ విజయ దరహాసానికి కారకులు వారే. ఆ జోడీలు చేసిన జైత్రయాత్రల ఫలమే. ఆ వివరాలేంటో చూద్దాం.


పట్టుదల .. లక్ష్యశుద్ది.. చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా .. ఎన్ని బాధలు మెలిపెట్టినా .. ఎన్ని రకాల కష్టాలు ఒక్కసారిగా ఎగసిపడినా.. చెదరని ధైర్యం ఉంటే ముందడుగే పడుతుంది. నిబద్ధత .. కార్యదక్షత.. చేసే పని మీద ఏకాగ్రత ఉంటే వెనుతిరిగి చూసే పనే ఉండదు. అవే విజయాన్ని సాధించి పెడతాయి. ఉన్నత దిశగా తీసుకు వెళతాయి. అలాంటి భావాలు కలిగిన జాతీయ వాదుల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రముఖులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించారు. 1951 లో జనసంఘ్ పేరిట తొలి హిందూ రాజకీయ పార్టీని స్ధాపించిన ఘనత వారిది. వీరికి సరిజోడీగా చేరి జనసంఘ్ ను పరుగులు పెట్టిన వారిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయది ప్రత్యేక స్ధానం. ఒకరు ప్రచారక్. మరొకరు గృహస్తు. వీరిద్దరు కలిసి నెరపిన సిద్దాంతం జనసంఘ్. భారత్ స్వావలంబన కలిగిన దేశంగా ఉండాలని భావించారు. పాశ్చాత్య భావనలపై ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆధారపడకూడదని తలచారు. కాంగ్రెస్ విధానాలతో విభేదించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ.. దీన్ దయాళ్ జోడీ సాధించిన విజయాలు ఎన్నో. చైతన్య పరిచిన కార్యక్రమాలు మరెన్నో. భావి తరానికి బాటలు వేసిన రాజకీయ సిద్ధాంత కర్తలుగా వారు చిరస్మరణీయులు. కొందరు మరణించే వరకు మాత్రమే జీవిస్తారు. కానీ .. వీరు మరణించిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. జనసంఘ్ పార్టీకి వ్యవస్ధాపక అధ్యక్షులుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ వ్యవహరిస్తే.. ప్రధాన కార్యదర్శిగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పని చేశారు. పార్టీని ఏర్పాటు చేసిన కేవలం మూడు నెలలకే ఓ రికార్డుని నెలకొల్పారు. జనామోదంతో .. జనా కర్షణతో 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్ అప్పటి ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. అంటే ఆ ఘనత శ్యాంప్రసాద్, దీన్ దయాళ్ దే. వీరి జోడీకి అప్పట్లో నెహ్రూ లాంటి నేతలు కూడా భయపడే వారు. సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ప్రజాదరణ ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. శ్యాంప్రసాద్, దీన్ దయాళ్ సమన్వయ కౌశలంతో జనసంఘ్ ఓ చైతన్య తరంగమై ఎదిగింది. వీరికి ప్రధాన శిష్యునిగా, అనుయాయిగా వ్యవహరించిన నేతే అటల్ బిహారీ వాజ్ పేయి.


ఆ తర్వాత జోడీ నెంబర్ టూ గా పేరు గడించారు అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ. దేశంలో అప్పటి వరకు ఉన్న రాజకీయ గతిని మార్చిలో వారిలో ఒకరు అటల్ బిహారీ వాజ్ పేయ్ కాగా మరొకరు లాల్ కృష్ఠ అద్వానీ. వారేసిన పునాదుల పైనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓ శక్తిగా ఎదిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో విజయ కేతనం ఎగరేసింది. కమల దళం కందం తొక్కుతోంది. విజయ గర్వంతో మీసం మెలేస్తోంది. 1942లో స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గోని జైలు జీవితం కూడా అనుభవించాడు వాజ్ పేయి. ఆ తర్వాత 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పాటుతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ తో కలిసి పని చేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీతో అనుచరునిగా ఎదిగారు. 1957లో బలరామ్ పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్ కు పోటీ చేసి.. ఘన విజయం సాధించారు. అనర్గళమైన ఆయన ఉపన్యాస ఝరికి ఆకర్షితుడైన జవహర్లాల్ నెహ్రూ .. ఎప్పటికైనా నువ్వు దేశ ప్రధానివి అవుతావని ప్రశంసించారు. అంతటి రాజకీయ మేధావిగా పేరుగడించారు. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయనతో పాటు లాల్ కృష్ణ అద్వానీ కూడా జనసంఘ్ కోసం ఎంతో పాటు పడ్డారు. అలా మొదలైన వారి ప్రస్ధానం దేశ రాజకీయాలను ఓ మలుపు తిప్పే వరకు సాగింది. 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసి దానికి మొదటి అధ్యక్షునిగా వాజ్ పేయి పని చేశారు. అప్పటి నుండి అనేక ఉద్యమాలను ఆందోళనలను నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించారు. వీరిలో వాజ్ పేయి ప్రచారక్ కాగా.. అద్వానీ గృహస్తు. వీరి జోడీ రాజకీయంగా ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. దేశంలో కొత్త అధ్యాయానికి తెరతీసింది.


1984లో వాజ్ పేయి సారధ్యంలో పార్లమెంట్ కు పోటీ చేసిన బీజేపీ రెండు స్ధానాలను గెలుచుకుంది. ఆ తర్వాత నుండి ఇక తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వచ్చింది. అద్వానీ-వాజ్ పేయి కాంబినేషన్ బీజేపీకి బాగా కలిసొచ్చింది. అయోధ్యలో రామ జన్మభూమిపై జరిగిన ఉద్యమంలో రాజకీయంగా వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. వాజ్ పేయి సలహా మేరకు అద్వానీ చేపట్టిన రామజన్మభూమి రథయాత్ర దేశ వ్యాప్తంగా సాగింది. దాంతో బీజేపీకి మంచి గుర్తింపు వచ్చింది. చిన్నచిన్నగా రాష్ట్రాల్లో పునాదులు వేసుకుంటూ వచ్చింది. ఏ విషయంపైన అయినా సరే ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుని .. పార్టీలో చర్చించిన తర్వాత ఆచరణలోకి తీసుకు వచ్చే వారు. అలా పార్టీ ఎన్నో విజయాలు సాధిస్తూ వచ్చింది. ఇద్దరూ కలిసి కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకు రాగలిగారు. 1996 నుండి 2004 మధ్య మూడు పర్యాయాలు ప్రధానిగా వాజ్ పేయి పదవీ బాధ్యతలు చేపట్టారు. అద్వానీ, వాజ్ పేయి కాంబినేషన్ బీజేపీకి ఓ హిట్ కాంబినేషన్ గా చెప్పాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అనేక అంశాలపై దృష్టి పెట్టారు. అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం, లాహోర్ సదస్సు, భారతీయ విమానం హైజాక్, ఆర్ధిక సంస్కరణలు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ కు రూపకల్పన, పార్లమెంట్ పై దాడి, గుజరాత్ హింసాకాండ ఇలా ఎన్నో పరిణామాలు జరిగాయి. ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టారు. బీజేపీ అధ్యాయంలో అదో స్వర్ణయుగం. అదో హిట్ పెయిర్. అదో సంచలన జోడీ. విపక్ష నేతలు సైతం వారిని చూసి ఈర్ష్య పడేవారు. వారి వాక్చతురతకు అబ్బురపడే వారు. దేశం మొత్తం వారి ప్రసంగాలను వినేందుకు ఇష్ట పడేది. నీతివంతమైన బీజేపీ పాలనకు మార్గం చూపారు. 1990 తర్వాత బీజేపీని అభివృద్ధి పథంలోకి నడిపించి కొత్త పుంతలు తొక్కించడంలో అద్వానీ-వాజ్ పేయి చేసిన కృషి అంతాఇంతా కాదు. అందుకే వారిద్దరిదీ ఏ బంధానికీ అందని అమోఘమైన సంబంధం.


ఇక 1986లో బీజేపీలో చేరిన గుజరాత్ కేసరి నరేంద్ర మోడీ.. అమిత్ షాల జోడీ కూడా ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. అద్వానీ- వాజ్ పేయి తర్వాత మంచి హిట్ కాంబినేషన్ గా మోదీ-షా ద్వయానికి పేరు. గుజరాత్ లో మోదీ నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసినా.. ప్రధాని గా రెండు పర్యాయాలు వ్యవహరించినా ఆ దక్షత వెనుక దాగున్నది అమిత్ షాయే. బిజేపీని ప్రజలకు మరింత దగ్గర చేసిన జంటగా వీరికి పేరు. అద్వానీ- వాజ్ పేయి హయాంలో కేవలం కొన్ని రాష్టాలకే పరిమితమైన బీజేపీ, మోదీ-అమిత్ షా హయాంతో అన్ని రాష్టాల్లో బలీయమైన శక్తిగా ఎదిగింది. ఇప్పుడు దక్షిణాదిలో గట్టి పునాదులు వేసి, తెలంగాణలో అధికారంలో నిలిపే పనిలో పడ్డారు. అటు తమిళనాడు, ఏపీలో కూడా గతంలో కంటే మంచి పునాదులు పడ్డాయి. ఆ ఘనతంతా మోదీ-షా ద్వయానిదే. ఇప్పుడు వీరు నిర్వహించే వన్నీ పవర్ పాలిటిక్సే. గతంలో సిద్ధాంతాలకు కట్టుబడ్డ విధానం ఉంది. ఇప్పుడు అలాంటి వాటికి తిలోదకాలు ఇస్తున్నారన్న అపవాదులు ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కాశ్మీర్ లో 370వ అధికరణ రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, జాతీయ పౌర జాబితా అమలుతో పాటు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకు వచ్చి అతి పెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటి వెనుక అమిత్ షా ఆలోచనలు కూడా ఇమిడీకృతమై ఉన్నాయి. ఎలాంటి సంస్కరణలు తీుకు రావాలన్నా దానిపై కసరత్తు అంతాఇంతా కాదు. ముందుగా ఇద్దరూ చర్చించాకే .. పార్టీలో కూడా ఆయా అంశాలను ప్రవేశ పెట్టి మమ అనిపిస్తారు. అలా అనిపించడంలో షా పాత్రే ఎక్కువ. కానీ.. వీరిద్దరూ కలిసి అద్వానీతో సహా చాలామంది సీనియర్లను కావాలనే పక్కన పెట్టారన్న తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. అయితే పార్టీ మాత్రం అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత మాత్రం మోదీ- షా జంటదే.

Prime Minister Narendra Modi and Amit Shah during the Diwali Mangal Milan at party headquarters in New Delhi on Saturday. Picture by Rajesh Kumar.28/November/2015


వీరిది విడదీయలేని, విడలేని స్నేహబంధం. ఏ జోడీకి ఆ జోడీ .. ఆయా కాలాలలో విజయ భేరీలను మోగించాయి. ప్రతి అడుగులో ఎదురు దెబ్బలు. తమ సిద్ధాంతాలను .. ఆలోచనలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళే క్రమంలో ఎన్నో అవమానాలు. విమర్శలు.. నిందారోపణలు. అయినా ఆ జోడీలన్నీ తట్టుకుని నిలబడ్డాయి. ఎన్నో సమస్యలతో తలపడి.. కలబడి తాము నమ్ముకున్న సిద్ధాంత పతాకాలను ఎగరేశాయి. శ్యాంప్రసాద్- దీన్ దయాళ్, వాజ్ పేయి.- అద్వానీ, మోదీ-అమిత్ షాల ద్వయం రాజకీయంగా ఓ సంచలనం. ఓ చైతన్యం, ఓ స్పూర్తి పతాకం. దేశం గర్వించదగ్గ జోడీల సమన్వయం.