24 సీట్లేనా అంటూ ఎటకారం వద్దు.. బలి చక్రవర్తిని వామనుడు రెండడుగులేనని తొక్కేశాడన్న జనసేనాని పవన్ కల్యాణ్!
యువ ముఖ్యమంత్రి వల్ల ఒరిగిందేముందన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. భవిష్యత్ పాతికేళ్లలో ఏం ఇస్తే బాగుంటుందో ఆలోచించాల్సిన జగన్ ఆ పని చేయడం లేదన్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అభిమానులని చెప్పుకునేవారు కూడా తనకు ఓటేయలేదని, జగన్మోహన్ రెడ్డికి ఓటేశారని పవన్ గుర్తు చేశారు. దాని వల్ల అభిమానులే ఇప్పుడు సఫర్ అవుతున్నారన్నారు. తనకు కోట్లు సంపాదించుకునే మార్గాలున్నా… ప్రజల కోసం తపనపడుతున్నానన్నారు. అలా తపన పడితే రెండు చోట్ల ఓడించారన్నారు. అయినా బాధలేదన్నారు. ఓటమి బాధ ఎలా ఉంటుందో తెలుసా అని అభిమానులను పవన్ ప్రశ్నించారు. పరీక్ష తప్పితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసునన్నారు. తనకూ ఎంతో బాధ ఉందని.. దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీని ట్రైన్లోంచి గెంటివేసిన ఘటన తనకు గుర్తుకొచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. ఆటుపోట్లు లేకుండా అవమానాలు లేకుండా జీవితాలుండవన్నారు. ప్రజల కోసం, అవమానాలను భరించి.. ప్రజా కంటకుడ్ని ఎదుర్కొంటున్నామన్నారు.

ఉద్యోగాలకు వెళ్లాలంటే కాండక్ట్ సర్టిఫికేట్ కావాలి… ఒక ముఖ్యమంత్రికి కాండక్ట్ సర్టిఫికేట్ అక్కర్లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులున్నా పర్లేదని, ఆయన చుట్టూ ఉండేవారికి కూడా కాండక్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదా అని పవన్ ప్రశ్నించారు. చిన్న ఉద్యోగం కావాలంటే కాండక్ట్ సర్టిఫికేట్ అవసరముందని… అసలు మన కాండక్ట్‌కు సర్టిఫికేట్ ఇచ్చేవారు… మనకంటే ఉన్నతులై ఉండక్కర్లేదా అని పవన్ ప్రశ్నించారు. పొద్దున్నే డబ్బులిస్తాడు. సాయంత్రం సారా కింద పట్టుకుపోతాడని జగన్‌ను దుయ్యబట్టారు. ఏళ్ల నుంచి అన్నీ తట్టుకొని నిలబడి రాజకీయాలు చేస్తున్నానన్నారు. తాను ఏ రోజు ఎవరినీ చేయి చాచి డబ్బులడగలేదన్న పవన్, కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు చేస్తున్నానన్నారు. దేశం బాగుండాలనే, సమాజం బాగుండాలనే తపన తనకు ఉందన్నారు.

సినిమాల్లో కూడా అందరూ బాగుండాలని కోరుకున్నానన్నారు. బాలయ్య సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, ప్రభాస్ సినిమాలు హిట్ కావాలని కోరుకున్నానన్నారు. ప్రజలందరూ కొట్లాడుకోకుండా కులాల మధ్య, వర్గాల మధ్య రాజకీయ విభేదాల్లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలన్నదే తన కోరికన్నారు. పొత్తులో భాగంగా 24 స్థానాలు తీసుకుంటే.. ఇంతేనా అంటున్నారు. వారెవరూ కూడా మనవాళ్లు కాదన్నారు. అవతల వాళ్లని చెప్పారు పవన్. బలి చక్రవర్తి కూడా వామనుడ్ని చూసి ఇంతేనా అన్నారని… నెత్తిమీద కాలుపెట్టి బలిచక్రవర్తిని తొక్కుతున్నప్పుడు తెలిసింది. వామనుడెంతటివాడన్నది.. జనసేన కూడా జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాళానికి తొక్కుతుందన్నారు పవన్ కల్యాణ్. నెత్తిపై కాలేసి తొక్కినప్పుడు అర్థమవుతుందని పవన్ కల్యాణ్ శక్తి ఏంటో జగన్‌కని దుయ్యబట్టారు.

