ఢిల్లీ పెద్దలతో ఏపీ రాజకీయాలపై చర్చించనున్న జనసేనాని
త్వరలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటి కానున్న పవన్ కళ్యాణ్
ఏపీలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందంటూ ఎప్పటికప్పుడు గళమెత్తుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ తనను హైదరాబాదు నుండి మంగళగిరికి రానివ్వకుండా అడ్డుకున్న తీరును కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పవన్ కళ్యాణ్ తెలియజేయనున్నారు. ఇందుకోసం త్వరలో ఢిల్లీ పర్యటనకు ఆయన వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శుల, జిల్లా ఇన్చార్జిలు సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వ అరాచకాలపై కేంద్రంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పోలీసు వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మాట వినని పోలీస్ అధికారులను వెను వెంటనే బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తుల పైన కూడా చర్చలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల ఓటు చీలకూడదని పదేపదే చెప్పిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలోనూ ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే పవన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.