175 నియోజకవర్గాల పరిశీలకులతో నేడు జగన్ సమావేశం
ఏపీలో ఎన్నికల రణ రంగానికి సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్ ఆ దిశగా జిల్లాల పర్యటనలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. బుధవారం విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ సభ సక్సెస్ కావడంతో జగన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం మరో కీలక సమావేశం ఆయన నిర్వహించబోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో స్వయంగా ఆయనే నియమించిన పరిశీలకులతో భేటీ కాబోతున్నారు. ఎన్నికలే ప్రధాన అజెండాగా సాగే ఈ కీలకమైన సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై కూడా చర్చించనున్నారు. నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న వివిధ అంశాలపై సమావేశంలో చర్చించి పరిశీలకులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే నియోజకవర్గ పరిశీలకులతో పాటు, 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎనిమిది ప్రాంతాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సీఎం జగన్ భేటీ కాబోతున్నారు.

వాస్తవానికి డిసెంబర్ మొదటి వారంలో గడపగడపకు మన ప్రభుత్వం చివరి వర్క్ షాప్ ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న కొంతమంది నేతల విజ్ఞప్తి మేరకు ఆ కార్యక్రమాన్ని కొన్ని రోజులు పాటు వాయిదా వేశారు. నేడు జరిగే ఈ భేటీలో నూతనంగా నియమించబడ్డ పరిశీకుల కు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వటంతో పాటు నియోజకవర్గ పరిధిలో వారి విధివిధానాల ను జగన్ వివరించనున్నారు. వారితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులును కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం వెనక జగన్ పరిశీలకులకు కీలకమైన బాధ్యతలను అప్పగించబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఎన్నికలకు సమాయత్తమవుతున్న జగన్ జిల్లాల పర్యటనలను ఇప్పటికే జోరుగా పెంచారు. దీంతో పాటు ముఖ్య నేతలతో కీలకమైన సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే నేడు నియోజకవర్గ పరిశీలకులు జిల్లా పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యి నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోనున్నారు. ఎన్నికలే ప్రధాన అజెండాగా సరికొత్త ప్రణాళికలు రూపొందించుకొని జగన్ ముందుకు వెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.