వివేక హత్య విషయంలో ఇద్దరు చెల్లెళ్లను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారన్న జగన్
ప్రొద్దుటూరులో ఇలాంటి సభ ఇంత వరకు జరిగి ఉండదన్నారు సీఎం వైఎస్ జగన్. బాబాయ్ వైఎస్ వివేక హత్యకు సంబంధించి ప్రొద్దుటూరులో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రత్యర్థుల మాదిరిగా ఎవరితో జట్టు కట్టలేదని, ప్రజలతోనే జట్టు కట్టానన్నారు జగన్. వైఎస్ వివేక హత్య విషయంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శలుగుప్పించారు. మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో దుష్ట చతుష్టయం తనపై కుట్రలు చేస్తూనే ఉందని దుయ్యబట్టారు.

విశాఖలో దొరికిన డ్రగ్స్‌తో చంద్రబాబు, ఆయన వదిన పురంధేశ్వరి, ఆమె కొడుకుకు లింకులున్నాయి. కానీ ఎల్లో మీడియా మాత్రం దాన్ని కప్పిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్నారు సీఎం వైయస్ జగన్. ఎన్నికల కోసం చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చి.. గెలిచాక ప్రజలకు కనిపించకుండా దాచేస్తారన్నారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతో సిగ్గులేకుండా జతకడతారని… ఇందుకోసం ఢిల్లీదాకా వెళ్లి కాళ్ళు పట్టుకుంటారని దుయ్యబట్టారు. 45 ఏళ్లుగా చంద్రబాబు కుట్రలు, మోసాలకు పాల్పడుతూనే ఉన్నారని ఆరోపించారు.

వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసున్నన్నారు జగన్. తనపై ఇద్దరు చెల్లెల్లను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారన్నారు. హత్య చేశానని చెప్తూ బయట తిరుగుతున్న నిందితుడిని వెనుక ఉండి నడిపిస్తోందెవరో అందరికీ తెలుసునన్నారు. నిందితుడికి చంద్రబాబుతోపాటు ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా మద్దతిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి, కాంగ్రెస్‌తో సహా రాజకీయ ప్రత్యర్థులందరూ తనను ఒంటరి చేసి యుద్ధం చేస్తున్నారన్నారు. తనకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమైనా, ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశానన్న జగన్.. విశ్వసనీయతకు కట్టుబడి పాలన సాగించానన్నారు.