పార్టీ నేతలకు జగన్ ఝలక్…మీరే పోటీ చేయాలి…వారసులకు నో ఛాన్స్ !
◆ వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామంటున్న టీడీపీ
◆ వ్యూహ ప్రతి వ్యూహాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు
◆ ఈసారికి మీరే పోటీ చేయాలని క్లియర్‌గా చెబుతున్న జగన్
◆ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పలువురు వైసీపీ నేతలు
ఏపీలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో దృష్టి సారించి తదనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా అధికార పీఠం కైవసం చేసుకోవాలని పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటి నుండే నేతలను ఆ దిశగా నడిపించే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది. చంద్రబాబు స్పీడును పెంచి నియోజకవర్గం ఇన్చార్జిలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గ ఇన్చార్జితో ఆయనే స్వయంగా భేటీ అయి నియోజకవర్గ పరిస్థితులను ఒక వైపు తెలుసుకుంటూనే మరోవైపు పార్టీ యంత్రాంగం ద్వారా సేకరించిన నివేదికలను వారికి వెల్లడిస్తున్నారు.

అదేవిధంగా సీఎం జగన్ కూడా ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమీక్షలు జరిపి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో క్రమం తప్పకుండా ప్రతి ఎమ్మెల్యే పాల్గొనాలని ప్రజలలో ఉండని ఎమ్మెల్యేలను మార్చివేస్తానని గంటాపధంగా చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి మిషన్ 175 వేగవంతం చేశారు. నియోజకవర్గ పరిస్థితులు సిట్టింగులు తీరుపై ఆరా తీస్తున్న జగన్ ఈసారి ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయింపు ఉంటుందని చివరగా జరిగిన సమీక్షలో బాంబు పేల్చారు. అలానే సిట్టింగ్ స్థానాల మార్పుపై పరిశీలనను ప్రారంభించిన జగన్ ఈసారి ఎన్నికల్లో వారసులకు టికెట్లు కేటాయింపు ఉండదని మీరే పోటీ చేయాలని క్లియర్‌గా ఎమ్మెల్యేలకు చెప్పేశారు.

అయితే టీడీపీ అధినేత మాత్రం వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామంటూ ఒంగోలులో జరిగిన మహానాడులో ప్రకటించారు. యువతకు అవకాశం ఇవ్వడం అంటే తమ పార్టీ నేతల వారసులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడమన్న చర్చ పార్టీలో ఉంది. వైఎస్ జగన్ వారసులకు టికెట్లు కేటాయింపు ఉండదని ప్రకటించగా చంద్రబాబు మాత్రం వారసులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వారు తీసుకున్న భిన్న అభిప్రాయాలతో ఇప్పటినుంచే నేతలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగితేలుతున్నారు.

అధినేతలిద్దరూ తీసుకున్న ఈ నిర్ణయాల ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతుంది. వైసీపీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు సీనియర్లు ఈసారి తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ వారసులను ప్రచారంలో కూడా తిప్పుతున్నారు. కానీ జగన్ చేసిన కీలక వ్యాఖ్యలతో నేతలంతా తమ వారసుల భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు. మరోవైపు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా టీడీపీలో వారసులకు టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సై అంటున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసినవారు సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు మద్దతిస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో తిరుగుతున్న కొందరు యువ నాయకులు వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు ఖాయమని ఆలోచనలో ఉన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ తరఫున బరిలోకి దిగే వారిలో యువతకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలతో ఇరుపార్టీలలో యువ నాయకులకు ప్రోత్సాహం కూడా లభించింది. కానీ ఇప్పుడు సీఎం జగన్ వారసులకు టికెట్లు లేవని చెప్పడంతో వైసీపీలోని సీనియర్లు తమ వారసులను వేరే పార్టీలకు పంపి పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఈ పరిణామాలు రాబోవు ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపుతాయో ఏ పార్టీకి మైలేజీ పెరుగుతుందో చూడాలి.