అభ్యర్థుల వడపోతకు జగన్ శ్రీకారం
◆ త్వరలో ఎమ్మెల్యేలతో మరో సమావేశం
◆ బూత్ కమిటీల పై పూర్తిస్థాయి ఫోకస్
◆ ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ పైన దృష్టి
◆ జనవరిలోనే కొత్త ముఖాలు
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ పూర్తి మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో అందుకు అవసరమైన వనరులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీల పొత్తులు, ప్రస్తుతం ఎమ్మెల్యేల గ్రాఫ్‌పై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు తన ఎన్నికల టీం ను సిద్ధం చేసుకుంటూనే సమర్థవంతమైన అధికార యంత్రాంగాన్ని కూడా నియమించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెలాఖరుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తనకు అనుకూలమైన సమర్థవంతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించ యోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. దీంతోపాటు వివిధ జిల్లాల్లో అధికారుల పనితీరు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి నివేదికలను తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొందరు అధికారులు నిర్లిప్త వైఖరిని అవలంబిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అర్హులైన వారు ఏ పార్టీకి చెందిన మనకు ఓటు వేయకపోయినా పారదర్శకంగా పథకాలు పంపిణీ చేయాలని పలు సందర్భాల్లో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాల జారీ చేస్తున్నారు.

దీంతోపాటు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పూర్తిస్థాయి దృష్టి పెట్టి ప్రతిరోజు నివేదికలు తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. ఇక పార్టీ పరంగా అనుబంధ సంఘాలను బలోపేతం చేయటం బూత్ కమిటీల నియామకం జరపాలని జగన్ ముఖ్య నేతలకు నిర్దేశిస్తున్నారు. వచ్చే ఎన్నికలు కీలకం కానున్నందున సమర్థులైన విజయ అవకాశాలున్న అభ్యర్థులను నియమించే ఉద్దేశంతో వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరు నెలల పనితీరుపై డిసెంబర్ లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో తన వద్ద ఉన్న నివేదికల సారాంశాన్ని ఎమ్మెల్యేల ముందు బయట పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో వారి పనితీరే కొలమానంగా టికెట్లు ఇస్తానని చెప్పిన ఆయన గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లో మమేకం కావాలంటూ పదేపదే ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలో తొలిసారిగా గడపగడపకు నిర్వహించిన జగన్ ఆ సమావేశంలో ఆరు నెలల సమయం ఇస్తున్నాను ఈలోగా పరిస్థితులు మారకపోతే అభ్యర్థుల్ని మార్చేస్తానంటూ కీలక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు ఆ కీలక ప్రకటన ముగిసే సమయం కూడా దగ్గర పడుతుంది.

వచ్చే నెల నాలుగో తేదీన ఆయన చెప్పిన ప్రకారం చివరి వర్క్ షాప్ జరగబోతుంది. ఈ వర్క్ షాప్ లో ఎవరు జాతకాలు ఎలా ఉన్నాయో తేలనున్నడటంతో ఆ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈసారి వీలైనంత నియోజకవర్గాల్లో సిట్టింగుల స్థానాలలో వేరే వాళ్ళని నిలపటానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎందుకు చాలా కారణాలు ఉన్నాయని కూడా వారు చెబుతున్నారు. ఈసారి 175 స్థానాలపై గురిపెట్టిన జగన్ అభ్యర్థుల ఎంపిక ఆచితూచి అడుగులు వేచి నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తుంది. ప్రతిరోజు అందుతున్న నివేదికలను జగన్ క్షుణ్ణంగా పరిశీలించి స్వయంగా విశ్లేషించుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో జనవరిలో కొత్త ముఖాలతో జగన్ జాబితాను ప్రకటిస్తారని ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖాల ప్రకటన తద్యమంటూ ఆ పార్టీలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది.