Andhra PradeshHome Page Slider

మాఘ పౌర్ణమికి ఊరు ఖాళీ చేసే వింత ఆచారం

భారతదేశం అనేక రకాల సంస్కృతులు, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఆనాదిగా ఈ దేశంలో రకరకాల ఆచారాలను, అలవాట్లను పాటిస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకం ఉంటుంది.  కొన్ని అలవాట్ల వల్ల నష్టాలు లేనప్పుడు వాటిని ఖండించవలసిన అవసరం లేదు. కొన్ని పద్దతులు మనకు వినడానికి వింతగా అనిపిస్తాయి. ఇలాంటి ఒక పద్దతి అనంతపురంలోని తలారి చెరువు అనే ఊరి ప్రజలు పాటిస్తున్నారు.

 ఊరిబాగు కోసం ‘తలారి చెరువు’ అనే గ్రామవాసులు ప్రతీ సంవత్సరం మాఘపౌర్ణమి మొదలు కాకుండానే ఊరంతా ఖాళీ చేసేస్తారు. దీనిని వారు అగ్గిపాడు అంటారు. పెంపుడు జంతువులతో సహా ఊరు విడిచి వెళ్తారు. పౌర్ణమి ఘడియలు పూర్తయ్యేంతవరకు తిరిగి ఊరిలోకి రారు. పౌర్ణమి రోజంతా ఊరికి దగ్గరలోని దర్గాకు చేరుకుంటారు. ఒకప్పుడు ఆ ఊరిలో పుట్టిన పిల్లలు పుట్టినట్లే చనిపోయేవారట. దీనితో ఒక పండితుడు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుని హత్య జరిగిందని, ఆ శాపం వల్లే ఇలా జరుగుతోందని చెప్పాడు. అలా కాకుండా ఉండాలంటే అగ్గిపాడు అనే ఆచారాన్ని పాటించాలని, అన్ని ఇళ్లలో అగ్గి, దీపాలు లేకుండా చీకటిగా ఉంచాలని చెప్పాడు. మాఘ పౌర్ణమి పూర్తయిన తర్వాత తిరిగివచ్చి దీపాలు వెలిగించి, పూజలు నిర్వహిస్తారు. మాఘపౌర్ణమి ఘడియలు రాకముందే గ్రామ ప్రజలంతా  ఊరు దాటి దర్గాకు చేరుకుంటారట. అక్కడే వంటలు చేసుకుని, వన భోజనాలు చేసి రోజంతా అక్కడే గడుపుతారు. ఇలా చేస్తే ఎలాంటి అరిష్టాలు ఏర్పడవని వారు బలంగా నమ్ముతున్నారు. ఇలా ప్రతీ సంవత్సరం వారు క్రమం తప్పకుండా చేస్తున్నారు.