ఉప్పల్ స్టేడియం ఇంత దారుణమా?
భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. టికెట్ల కోసం జింఖానా మైదానంలో తొక్కిసలాట జరిగినా వెనక్కి తగ్గలేదు. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39 వేలు. టికెట్ల కోసం మాత్రం లక్షలాది మంది అభిమానులు ఎగబడ్డారు. దీంతో డబ్బులు రాబట్టడంపైనే దృష్టి పెట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. స్టేడియంలో ఏర్పాట్లు, ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించడాన్ని మాత్రం గాలికొదిలేసింది.

విరిగిన కుర్చీలు.. చెత్తా చెదారంతో స్టేడియం
హైదరాబాద్‌లో మూడేళ్ల తర్వాత జరిగే మ్యాచ్‌పై 2500 మంది పోలీస్ సిబ్బంది, 300 సీసీ కెమెరాలతో హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టనున్నారు. అగ్నిమాపక, మెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లు, స్నేక్ క్యాచర్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. అయితే.. స్టేడియం లోపల మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించేందుకు వేసిన కుర్చీలు విరిగిపోయి అధ్వాన్నంగా తయారయ్యాయి. స్టేడియంను కనీసం శుభ్రం కూడా చేయలేదు. వందలాది రూపాయలు వెచ్చించి, ప్రాణాలకు సైతం తెగించి టికెట్ కొనుక్కుంటే.. చెత్తా చెదారంతో కూడిన స్టేడియంలోనే కూర్చోవాలా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెడ్డపేరే..
‘టికెట్లు కొనుక్కున్న వాళ్లు తమతో పాటు రెండు బకెట్ల నీళ్లు.. కాస్త సర్ఫ్ తీసుకొని వెళ్లండి’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లనూ సరిగ్గా నిర్వహించలేకపోతే హెచ్‌సీఏ పరువు పోతుందని వాపోతున్నారు. టికెట్లను బ్లాక్ చేయడం.. తమ వారికి ఎక్కువ ధరకు విక్రయించడంపైనే దృష్టి పెట్టిన హెచ్‌సీఏ పెద్దలు స్టేడియంలో కనీస సౌకర్యాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎన్నో రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్.. మ్యాచ్ నిర్వహణలో చెడ్డపేరు తెచ్చుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రజా రవాణానే బెటర్..
ఇక మ్యాచ్‌కు సొంత వాహనాల్లో రావడం కంటే.. బస్సులు, మెట్రో రైళ్లు వంటి ప్రజా రవాణాపై రావడం బెటర్ అని పోలీసులు అంటున్నారు. అప్పుడు ట్రాఫిక్ రద్దీ తగ్గి.. క్రికెట్ అభిమానులకు ఇబ్బంది కలగదని అంటున్నారు. మ్యాచ్ జరిగే ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ ప్రత్యేక మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అమీర్‌పేట్, జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్ నుంచి కనెక్టింగ్ రైళ్లు ఉంటాయి. ఆర్టీసీ కూడా 50 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. ఈ బస్సులను ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, మెహదీపట్నం, కోఠి, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాలకు నడపనుంది.

