Home Page SliderTelangana

“బీఆర్‌ఎస్‌”గా మారడమే “టీఆర్‌ఎస్‌”కు శాపమయ్యిందా?

తెలంగాణ ‘దంగల్’ మొదలయ్యింది. ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ వెనుకబడుతోంది. కాంగ్రెస్ పార్టీ పలు స్థానాలలో ముందంజలో కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌”గా మారడమే “టీఆర్‌ఎస్‌”కు శాపమయ్యిందని భావిస్తున్నారు రాజకీయ నిపుణులు. వారి అంచనాల ప్రకారం కేసీఆర్ తలకెత్తుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఈ పార్టీ పేరు మార్పు దెబ్బతీసిందని భావిస్తున్నారు. తెలంగాణలో ఘన విజయాలను నమోదు చేసుకున్న కేసీఆర్, జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగాలనే తపనలో సొంత ఇంట్లో నిప్పు రవ్వలను గుర్తించలేకపోయారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి అని, తెలంగాణ ప్రజలు నమ్ముకుని ఓట్లు వేసి, గెలిపించుకున్న పార్టీ పేరును భారత రాష్ట్రసమితిగా మార్చి పొరపాటు చేసారని అంటున్నారు. ఈ పేరు మార్పు  వల్లే ప్రజలలో బీఆర్‌ఎస్ కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల దృష్టి పెరిగింది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా  రాష్ట్రాన్ని ఇచ్చిందన్న విశ్వాసంతో ప్రజలు అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ పెట్టిన అనేక పథకాలు ప్రజాదరణ పొందాయి. కానీ వీటిలో దళిత బంధు పథకం కూడా కేసీఆర్‌ను దెబ్బ తీసిందని భావించవచ్చు. దళితుల సంఖ్య అత్యధికంగా ఉన్న తెలంగాణలో ఏకంగా పది లక్షల రూపాయలు దళితులకు సహాయం చేస్తానని చెప్పడం సాహసమే అవుతుంది. వీరిలో కనీసం పదోవంతుమందికి కూడా ఈ పథకం చేరలేదు. దీనితో దళిత బంధు పథకం రానివారందరూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఏదేమైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భస్మాసుర హస్తంలా తన నెత్తిన తనే చెయ్యి పెట్టుకున్నట్లయ్యింది.