ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం టీఆర్‌ఎస్ మైండ్ గేమేనా..?
మొయినాబాద్ ఫాం హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్‌ఎస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగంగానే జరిగిందా..? అనే చర్చ తెలంగాణ ప్రజల్లో.. ముఖ్యంగా మునుగోడు ప్రజల్లో జరుగుతోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేకూర్చడం.. బీఆర్‌ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు భవిష్యత్తులో చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసమే టీఆర్‌ఎస్ పకడ్బందీ వ్యూహంతో బీజేపీని ఇరుకున పెట్టేందుకే ఈ ప్లాన్ చేసిందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తలెత్తుతున్న పలు ప్రశ్నలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

హైదరాబాద్‌లో లావాదేవీలా..?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల కోసం కేసీఆర్ గడ్డ అయిన హైదరాబాద్‌ను బీజేపీ ఎంచుకుంటుందా.. అనేది తొలి ప్రశ్న. అదీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫాం హౌస్‌లో లావాదేవీలు జరపడమూ అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడి పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్ చెప్పినట్లే చేస్తారనే విషయం బీజేపీ నాయకులకు తెలియదా..? పక్కనే కర్నాటక, గోవా, మహారాష్ట్రతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల డీలింగ్‌కు అలాంటి సురక్షిత ప్రాంతాన్నే బీజేపీ ఎంచుకుంటుంది. బీజేపీ అనగానే స్వామీజీలు, మతాధిపతులు గుర్తుకొస్తారు. అందుకే కడపకు చెందిన స్వామీజీని ఈ ఆపరేషన్ కోసం టీఆర్‌ఎస్ వాడుకుందని ప్రచారం జరుగుతోంది.

అధిష్టానానికి తెలియకుండానే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారా..?
మరో విషయం.. మునుగోడు ప్రచారంలో ఉండాల్సిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం అనుమతి లేకుండానే హైదరాబాద్ వచ్చారా..? ఎన్నికల ఇంచార్జిగా ఉన్న మంత్రి కేటీఆర్ అందరితో నిత్యం టచ్‌లో ఉంటారు. ఆయనకు తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చే ధైర్యం చేయరు. నిజంగానే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలనుకుంటే పోలీసులకు వాళ్లే సమాచారం ఎందుకిస్తారు..? ఇదంతా కేసీఆర్ వేసిన స్కెచ్ ప్రకారమే జరిగిందనడానికి ఈ ఒక్క లాజిక్ చాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

డబ్బులే లేకుండా ఆపరేషన్ జరిగిందా..?
ఫాం హౌస్‌కు వచ్చిన పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేక పోవడానికి కారణమేంటి..? అంతేకాదు.. ఈ కేసులో ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పినా కోర్టు రిమాండ్‌కు ఎందుకు తిరస్కరించింది..? అసలు డబ్బులే లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా జరిగింది..? డబ్బులే పట్టుకోకుండా రూ.400 కోట్ల వ్యవహారం అని పోలీసులు, టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం ఎలా చేశారు..? మరోవైపు నందు అనే వ్యాపారవేత్తను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడిగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆయనకు టీఆర్‌ఎస్ నాయకులతోనే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌కు ప్లస్సా.. మైనసా..
చివరగా.. రూ.400 కోట్ల ఆపరేషన్ కోసం ముక్కూ ముఖం తెలియని స్వామీజీలు, ఎవరికీ తెలియని వ్యాపార వేత్తను బీజేపీ వాడుకుంటుందనడమూ అతిగా కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అనుభవం ఉన్న కేంద్ర మంత్రులకో, పార్టీలోని కీలక నేతలకో ఈ ఆపరేషన్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. బీజేపీని చక్రబంధంలో ఇరికించి మునుగోడులో లబ్ధి పొందాలని.. భవిష్యత్తులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేయకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగానే కేసీఆర్ ఈ ఆపరేషన్‌ను రూపొందించారని ప్రజలు భావిస్తున్నారు. మొత్తానికి.. టీఆర్‌ఎస్ రచించిన ఈ మైండ్ గేమ్ ఆ పార్టీకి ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా.. కాలమే నిర్ణయిస్తుంది.