ప్రభుత్వం పేదల కోసమా? రియల్ ఎస్టేట్ దళారుల కోసమా? ఈటల ఫైర్
రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. గ్రామంలో 195 రోజులుగా మా భూములు మాకే కావాలి అని ధర్నా చేస్తున్నా… ఎవరూ పట్టిచుకోవడం లేదన్నారు. 10 గ్రామాల్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్ర సర్కార్ మైనింగ్ జోన్ గా డిక్లేర్ చేసిందన్న ఈటల… నాటి నుంచి వద్దని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రింగ్ రోడ్డు కోసం భూములు తీసుకున్నప్పుడు కోటి రూపాయల ఎకరం ఉంటే 8 లక్షలు ఇచ్చారన్నారు. అసైన్డ్ భూములకు అసలే డబ్బులు ఇవ్వను అంటే అసెంబ్లీలో నేను కోట్లాడితే.. వాటికి కూడా ఇచ్చారన్నారు. వెయ్యి ఎకరాలు ఇస్తే ఇప్పుడు 670 ఎకరాలు మాత్రమే ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు. పేదల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకుందామా ? అని ఈటల ప్రశ్నించారు.

అన్నం వండుకుని మూత పెట్టకపోతే దుమ్ము నిండి ఆ అన్నం తినలేనంత కాలుష్యం ఇక్కడ వస్తుందన్నారు. 19 క్రషర్ మిషన్స్ పెట్టి ప్రజలజీవనవ్యవస్థ మీద దాడి చేస్తున్నారన్నారు. దిక్కులేని ప్రజలందరికీ బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి హక్కులు కల్పిస్తామని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారని… ఆయన ఎందుకు చెయ్యడం లేదన్నారు. 5800 ఎకరాలు భూమిని 10 కోట్ల రూపాయలు ఉంటే 20 లక్షలు ఇచ్చి తీసుకున్నారన్నారు. కేసీఆర్‌కి ఓటు వేసి బాగు చేయండి అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పని చేస్తున్నారన్నారు ఈటల. కంచే చేను మేస్తుందన్నారు. ప్రభుత్వాలు ఉన్నది పేదల కోసమా? బ్రోకర్ల కోసమా ? అని ప్రశ్నించారు.

