కేసీఆర్‌ను ‘ఫాంహౌస్’ భయం వెంటాడుతోందా..?
సీఎం కేసీఆర్‌ను ‘ఫాంహౌస్’ భయం ఇంకా వెంటాడుతోందా..? ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నుంచి ఆయన ఇంకా బయట పడలేదా..? తన ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడిపోతారని సీఎం భయపడుతున్నారా..? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్నారా..? మంగళవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ఫీట్లను చూస్తే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. ఎమ్మెల్యేలపై బుజ్జగింపులు, తాయిళాలు, బెదిరింపులు, హెచ్చరికలు.. ఇలా అన్ని ఫీట్లనూ ప్రయోగించారు. గత సమావేశాలకు భిన్నంగా ఈసారి కేసీఆర్ నిర్వహించిన ఫీట్లను చూస్తే ఎమ్మెల్యేలు జారిపోకుండా తంటాలు పడ్డారని తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను విశ్లేషిస్తే..

దర్యాప్తు సంస్థలకు భయపడొద్దు..
కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ అభయమిచ్చారు. 9 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, అక్రమాస్తులు కూడగట్టుకున్నారని ప్రజలతో పాటు సీఎం కేసీఆర్‌కూ తెలుసు. వీళ్ల అక్రమాల చిట్టాను బయట పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే ప్రజల్లో తమ ఎమ్మెల్యేల పరువు పోతుందని సీఎం భయపడుతున్నారు. అందుకే.. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలు చేపట్టి దర్యాప్తు సంస్థలను ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. అదే సమయంలో బీజేపీకి అండగా నిలిచే నాయకులపై రాష్ట్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఎదురు దాడికి పాల్పడే వ్యూహాన్నీ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బీజేపీతో టచ్‌లో ఉంటే అంతే సంగతులు..
‘బీజేపీతో ఎవరు టచ్‌లో ఉన్నారో నాకు తెలుసు’ అని ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టించారు. బీజేపీ నాయకులను ఎవరు రహస్యంగా కలిసినా తనకు తెలుస్తుందని.. ఏ ఫోన్‌తో, ఏ యాప్‌లో మాట్లాడినా తాను గుర్తు పట్టగలనని.. తన యాక్షన్ సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. అంటే.. తమపై కేసీఆర్ గూఢచారులను పెట్టారా..? తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారా..? అంటూ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు.. ఇప్పటికే జంప్ చేయాలనుకునే ఎమ్మెల్యేలు.. బీజేపీ నేతలతో సమాలోచనలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ ఆలోచనలను మానుకునే పరిస్థితిని పార్టీ అధినేత కల్పించారు. అంతేకాదు.. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ మీకే టికెట్ ఇస్తా’ అనే తాయిళం ఇచ్చి ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడకుండా కట్టడి వేశారు.

ఎమ్మెల్యేలను బిజీ చేసే ఎత్తుగడ..
మరోవైపు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని.. ఇంకా 10 నెలలు ఉందని.. ఈ కాలాన్ని ప్రజలతోనే గడపాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని.. బద్ధకించిన వారి టికెట్ గల్లంతేనంటూ కొరడా ఝుళిపించారు. 10 నెలల తర్వాత పార్టీ టికెట్ ఇచ్చే విషయం దేవుడెరుగు.. అప్పటి వరకు బీజేపీ వలలో టీఆర్‌ఎస్ చేపలు పడకుండా ఉండాలంటే వారిని బిజీ చేయడం ఒక్కటే మార్గమని కేసీఆర్ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులను బుజ్జగిస్తూ.. వారినీ పార్టీ చట్రంలోనే కొనసాగించే బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించారు. సీనియర్లకు, ప్రజా బలం ఉన్న నాయకులకు నామినేటెడ్ పదవుల ఎర వేసి.. వారినీ జారిపోకుండా కాపాడుకుంటున్నారు. ఎంత రాజకీయ చతురతను ప్రదర్శించినా.. మునుగోడులో గెలిచినా.. కేసీఆర్‌ను బీజేపీ భయం వీడటం లేదనే విషయం ఆయన ప్రసంగంలో కనిపించింది.

