ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
పాకిస్తాన్‌కు మైండ్ బ్లాంక్..
UN వేదికగా ఇండియా ఘాటు రిప్లై
కశ్మీర్ కాదు ముందు పాక్ సంగతి చూసుకోండి…
షరీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
తీవ్రవాదులకు మద్దతిచ్చేవారితో చర్చలు ఎలా చేస్తారు?
కుక్కకాటుకు చెప్పుదెబ్బ… ఇది పాకిస్తాన్ తీరుకు ఇండియా ఐక్యరాజ్యసమితి వేదికగా నిప్పులు కురిపించింది. ఐక్యరాజ్యసమితిలో శాంతి జపం చేసిన పాకిస్తాన్ ప్రధానికి చరుకలంటించింది భారత్… పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని… కశ్మీర్ వ్యవహరంలో పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని వ్యాఖ్యానించారు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి కార్యాలయ మొదటి సెక్రటరీ మిజితో వినిటో. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత వ్యతిరేక వ్యాఖ్యలకు ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిలోని భారత మిషన్ మొదటి కార్యదర్శి మిజితో వినిటో, కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ షరీఫ్ చేసిన వాదనలు అబద్ధమని, ఇండియాపై నేరుగా పోరాడి గెలవలేమని.. పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి దిగుతోందని విమర్శించారు. భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేయడానికి పాక్ ప్రధాని ఐక్యరాజ్యసమితి వేదికను ఎంచుకోవడం విచారకరమన్నారు.

దావుద్ ఇబ్రహీంను అప్పగించండి
పాకిస్తాన్‌లో సంక్షోభాన్ని దాచిపెట్టేందుకు, దుశ్చర్యలను మరుగున పరిచేందుకు… ప్రపంచానికి ఆమోదయోగ్యం కాని విధంగా ఇండియాపై విమర్శలు చేస్తోందని… బాధ్యతారాహిత్యంగదా వ్యవహరిస్తోందని భారత రాయబారి వినిటో మండిపడ్డారు. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం గురించి స్పష్టంగా ప్రస్తావిస్తూ, పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని పాకిస్తాన్ చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కుట్రదారులకు ఇప్పటికీ ఆశ్రయం ఇస్తున్నారని విమర్శించారు. తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న పాకిస్తాన్ ఇండియాపై అన్యాయమైన, సమర్థించలేని బూటకపు ప్రచారాలు చేయడం దారుణమన్నారు. పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పుకునే రాజకీయ నేతలు… సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎన్నటికీ ఆమోదించరాదన్నారు. భయంకరమైన ముంబై ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని కూడా ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో మాత్రమే కొన్ని విషయాలనైనా బయటకు చెబుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి వినిటో దుయ్యబట్టారు.

కశ్మీర్ ఇండియాలో అంతర్భాగం
ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్తాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను భారతదేశం కోరుకుంటుందని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది. జమ్మూ, కశ్మీర్ దేశంలో అంతర్భాగంగానే ఉందని… ఇకపైనా ఉంటుందని… ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌లో హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాలకు చెందిన బాలికల బలవంతపు కిడ్నాపులు, ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలను ప్రస్తావిస్తూ.. మైనారిటీ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దేశం ప్రపంచ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని భారత రాయబారి వినిటో ఆరోపించారు. భారత ఉపఖండంలో శాంతి, భద్రత, అభివృద్ధి కోరుకుంటున్నామన్న ఆయన… అది జరగాల్సి ఉందన్నారు. సరిహద్దు ఉగ్రవాదం ఆగిపోయినప్పుడు, ప్రభుత్వాలు అంతర్జాతీయ సమాజంతో, సొంతంగా స్వచ్ఛందంగా వ్యవహరించినప్పుడు అది జరుగుతుందన్నారు. ప్రజలు, మైనారిటీలు హింసించబడనప్పుడు కనీసం ఈ వాస్తవాలను ఈ అసెంబ్లీ ముందు గుర్తించినప్పుడు సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమవుతాయని భారత రాయబారి వినిటో అన్నారు.

షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ పొరుగుదేశాలతోపాటు, ఇండియాతోనూ శాంతి కోరుకుంటుందని పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో తెలిపారు. కశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వత పరిష్కారం లభించినప్పుడే అది సాధ్యవుతుందన్నారు. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను మార్చడానికి భారతదేశం చట్టవిరుద్ధమైన ఏకపక్ష చర్యలు… శాంతి అవకాశాలను బలహీనపరిచాయని… ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టాయని షరీఫ్ పేర్కొన్నారు. తన సందేశాన్ని ఇండియా స్పష్టంగా అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు దేశాలు ఆయుధాలు కలిగి ఉన్నాయని…. యుద్ధం ఒక ఆప్షన్ కాదని… శాంతియుత చర్చలు మాత్రమే సమస్యలను పరిష్కరిస్తాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్కడ పదవి కాపాడుకునేందుకు ఇండియా వ్యతిరేకతను పెంచి పోషిస్తూ కాలం గడిపేస్తున్నారని షబాజ్ షరీఫ్‌పై పాక్ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్.