తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం ప్రారంభమైంది. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో చలి తీవ్రత గత రెండు రోజులుగా పెరిగింది. ఉదయం చల్లటి గాలుల ఉధృతి పెరగడంతో పగటి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత బీభత్సంగా ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బయట తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పాడేరులో 12, మినుములురులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 11 డిగ్రీలు నమోదైంది. చలి తీవ్రత మరో నాలుగు రోజులు ఇలాగే కొనసాగుతుందని.. వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.