“పరిహారం పెంపు, జాతీయ విపత్తుగా ప్రకటించాలి”..రేవంత్
భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం.. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణ, పంట నష్టాలతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినందున స్వయంగా పరిశీలనకు రావాలని ప్రధానమంత్రిని కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు, పాడి పశువులకు ఇచ్చే పరిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఊహించిన దానికన్నా ఎక్కవ వర్షాలు వచ్చాయని, గతంలో అయిదేళ్లకో, పదేళ్లకో ఇలా వచ్చేవని.. ఇటీవల తరచూ వస్తున్నాయని, దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పంట నష్టంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయని, తక్షణమే రంగంలోకి దిగి పంట నష్టం వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం వెంటనే విడుదల చేశామని, ప్రస్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.