NewsTelangana

మునుగోడులో ‘గప్‌చుప్‌’గా పంపకాలు షురూ..

మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎక్కడి మైకులు అక్కడే గప్‌చుప్‌ అయ్యాయి. ర్యాలీలు, సభలు, రోడ్‌ షోలు సెలవు తీసుకున్నాయి. ఇక విందులు, వినోదాలు, పంపకాలు, ప్రలోభాల పర్వం మొదలైంది. పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉండటంతో వివిధ పార్టీల కార్యకర్తలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఓటరు స్లిప్పులు పంచే నెపంతో డబ్బులు, మద్యం సరఫరాను ప్రారంభించారు. ఒక పార్టీ రూ.100-1500 పంచితే.. మరో పార్టీ రూ.14000-15000 పంచుతోంది. అంతేకాదు.. క్వార్టర్‌ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్‌, చికెన్‌ వంటి తాయిళాలు కూడా సమర్పించుకుంటున్నాయి. చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో అయితే పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఓటుకు ఒక ఫుల్‌ బాటిల్‌ చొప్పున పంపిణీ చేస్తున్నారు. మొత్తానికి ఒక ఓటరుకు రూ.20 వేలు చొప్పున గిట్టుబాటు అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

డబ్బుల చుట్టే ఉప ఎన్నిక..

పట్టు కోసం ఒకరు.. పరువు కోసం మరొకరు.. ప్రతిష్ట కోసం ఇంకొకరు.. ఇలా పోటీ పడిన ఈ ఎన్నికలో ఎక్కడా వాగ్దానాలు, అభివృద్ధి, సంక్షేమం మాటే వినిపించ లేదు. వివిధ పార్టీల ప్రచారమంతా నోట్ల కట్టలు, డబ్బుల చుట్టే తిరిగింది. నాయకులు పోటీ పడి జంపింగ్‌లు చేయడం.. వివిధ పార్టీలు పోటీ పడి చేర్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గ్రామాల్లో కుల సంఘాలు, విందు భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించారు. కేసీఆర్‌, అమిత్‌ షా బహిరంగ సభలు నిర్వహిస్తూ జాతరను తలపించారు.  

అత్యంత ఖరీదైన ఎన్నిక..

ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్క అభ్యర్థి గరిష్టంగా 40 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. పార్టీలు ప్రచారం, ఖర్చుపై ఎన్నికల సంఘం పరిశీలకులు నిఘా పెట్టాలి. డబ్బులు చేతులు మారకుండా, మద్యం సరఫరా కాకుండా పర్యవేక్షించాలి. వీడియో పర్యవేక్షణ, వీడియో రివ్యూ టీమ్స్‌, అకౌంటింగ్‌ టీమ్స్‌, కంప్లైంట్‌ మానిటరింగ్‌ టీమ్స్‌, కాల్‌ సెంటర్‌ మానిటరింగ్‌ టీమ్స్‌ పని చేస్తుండాలి. కానీ.. రాజకీయ పార్టీలు ఇస్తున్న లెక్కలనే ఎన్నికల సంఘం అధికారులు రాస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తలపడుతున్న టీఆర్ఎస్‌, బీజేపీలు పోటీ పడి ఖర్చు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల ఖర్చు ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు చేరుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అత్యంత ఖరీదైన ఎన్నికగా దేశ చరిత్రలోనే మునుగోడు నిలవనుంది.