నువ్వొకటంటే.. నేను రెండంటా..!
వివిధ పార్టీల నేతల సవాల్, ప్రతి సవాల్
శృతిమించుతున్న నాయకుల విమర్శలు
పోస్టర్లతో ప్రత్యర్థుల హడావిడి పర్వం
సంజయ్‌పై ఈసీకి టీఆర్‌ఎస్ ఫిర్యాదు
మునుగోడు, మనసర్కార్: మునుగోడులో ప్రస్తుత పరిస్థితి ‘నువ్వొకటంటే.. నేను రెండంటా..!’ అన్న చందంగా తయారైంది. వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో విరుచుకుపడుతున్నారు. ప్రత్యర్థిపై ఎంత ఎక్కువ విమర్శలు కురిపిస్తే అంత ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించొచ్చని.. ప్రజల్లో చర్చకు దారి తీస్తుందని ఆరాట పడుతున్నారు. శృతిమించిన విమర్శలతో నాయకులు పరిధులను దాటుతూ నవ్వులపాలు కూడా అవుతున్నారు. పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు.

పోస్టర్ల పర్వం..
రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఉప ఎన్నికను సృష్టించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ పే’ అంటూ రాజగోపాల్ రెడ్డిపై పోస్టర్లు కూడా వెలిశాయి. తర్వాత రాజగోపాల్ రెడ్డికి మద్దతుగానూ పోస్టర్లు వెలిశాయి. హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీని గెలిపించి తప్పు చేశామని అక్కడి ప్రజలు బాధపడుతున్నారంటూ మునుగోడులో పోస్టర్లు వెలిశాయి. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తూ.. మునుగోడు ప్రజలు అనాథలా? అని ప్రశ్నించారు.

బరి నుంచి తప్పుకుంటామన్న టీఆర్‌ఎస్..
నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.18 వేల కోట్లు ఇప్పిస్తే మునుగోడు బరి నుంచి తప్పుకుంటామని.. దానికి మీరు సిద్ధమా.. అని బీజేపీ నాయకులకు టీఆర్‌ఎస్ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై బీజేపీ స్పందించలేదు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ఫైర్ అయ్యారు. అంటే.. టీఆర్‌ఎస్ నేతల మాటలు వింటుంటే భవిష్యత్తులోనూ బీజేపీతో కలిసిపోతామని సంకేతాలిచ్చినట్లు ఉందన్నారు. బీజేపీని ఓడించాలని తాము మద్దతిస్తే బీజేపీకి వంతపాడటమేంటని ప్రశ్నించారు. ఇలా అయితే టీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందనే నమ్మకం కలగడం లేదన్నారు.

బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు..
టీఆర్‌ఎస్ నాయకులను ‘దండుపాళ్యం బ్యాచ్’తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోల్చారు. బీజేపీ కార్యకర్తలను రాముడుగానూ.. టీఆర్‌ఎస్ కార్యకర్తలను రాక్షసులుగానూ అభివర్ణించారు. టీఆర్‌ఎస్ పార్టీ నోట్లు ఇస్తే తీసుకోవాలని.. ఓటు మాత్రం బీజేపీకే వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని విమర్శించారు. దానికి క్షుద్ర పూజలు చేయడాన్ని బీజేపీ వాళ్లే కదా నేర్పించింది..? అని టీఆర్‌ఎస్ నాయకులు ఎదురు దాడి చేశారు. దీంతో మునుగోడులో ప్రచారం చేయకుండా బండి సంజయ్‌పై నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.

ఇంకా ఎన్ని సిత్రాలో..
ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఇంకా ఎన్ని సిత్రాలు వినాల్సి వస్తుందో అని మునుగోడు ప్రజలు భయపడుతున్నారు. ఈ విమర్శల పర్వంలో మునుగోడు అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోవడం ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఒకరినొకరు తిట్ల దండకాన్ని ఆపేసి మా మునుగోడును ఎవరు.. ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని కోరుతున్నారు.