కమలా హారిస్ అధ్యక్షురాలైతే తొలి సంతకం ఆ బిల్లుపైనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ తన హామీలలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె అమెరికా ఇమ్మిగ్రేషన్ సమస్యపై మాట్లాడారు. తాను అధ్యక్షురాలైతే ఈ వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపైనే తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. ఈ బిల్లులో వలసల సమస్య పరిష్కారానికి వనరులను పెంచడం, న్యాయమూర్తులను నియమించడం, జరిమానాలు విధించడం వంటి అంశాలుంటాయి. సరిహద్దులను బలోపేతం చేసేందుకు అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సహా 1500 మంది బోర్డర్ ఏజెంట్లను నియమిస్తామని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు దేశంలోకి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు ఈ వలస చట్టం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ ఇప్పుడే ఎన్నికల వేళ అక్రమ వలసలు గుర్తు వచ్చాయా అంటూ ఎద్దేవా చేశారు. హింసాత్మక మూకలు అక్రమంగా ప్రవేశించి, హత్యలు, అత్యాచారాలు చేస్తున్నప్పుడు ఉపాధ్యక్ష పదవిలో ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

