Home Page SliderPoliticsTelangana

రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించా… త్వరలో కేసీఆర్‌ను కలుస్తా…

ప్రధాని మోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియాతో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… దాదాపు 20 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించానని, అడగ్గానే అపాయింట్‌మెంట్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ సమస్యలపైనే చర్చించానని వెంకట్‌ రెడ్డి తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, విజయవాడ హైవే విస్తరణ, యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పొడిగింపుతోపాటు భువనగిరి కోటకు రోప్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించారని వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మోదీని కలవడంతో పార్టీ మారవచ్చని ఊహాగానాలు వినిపించాయి.. అయితే.. ప్రధానితో రాజకీయాల గురించి మాట్లాడలేదని ఆయన చెప్పారు. మూసీ ప్రక్షాళన కోసం అవసరమైతే సీఎం కేసీఆర్‌ను కూడా కలుస్తానన్నారు. తానిప్పుడు కేవలం ఎంపీని మాత్రమేనని, ఏ కమిటీలో లేనందున కాంగ్రెస్‌ పార్టీ గురించి అడగొద్దని వెంకట్‌ రెడ్డి అన్నారు. రాజకీయాల గురించి ఇప్పుడేమీ మాట్లాడనని.. ఎన్నికలకు సరిగ్గా నెల ముందు అన్నీ మాట్లాడతానని,, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది అప్పుడే వెల్లడిస్తానని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు.