సినిమా హబ్‌గా హైదరాబాద్
చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించి, దేశవిదేశాల నుండి సినిమా నిపుణులను ఆకర్షించేలా హైదరాబాద్‌ను ప్రధాన సినిమా నగరంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన క్యాబినెట్ సబ్-కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్రనిర్మాతలు పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక శాఖల నుండి అనుమతులు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు, అన్ని అనుమతుల సమన్వయానికి ఒక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు.అలాగే, సినిమా థియేటర్లలో క్యాంటీన్ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన 50 ఎకరాల భూమిపై నివేదికను తదుపరి సమావేశంలో సమర్పించాలని సూచించారు.సినిమా కార్మికుల సంక్షేమం గురించి కూడా భట్టి విక్రమార్క చర్చించారు. చిత్రపురి కాలనీ నిర్వహణలో ఉన్న RCS కమిటీ సభ్యులు రాబోయే సమావేశానికి హాజరవ్వాలన్న సూచనలు ఇచ్చారు.
ఈ నెల జూన్ 14న జరగనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించాలని, ప్రముఖ టాలీవుడ్ నటులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర రంగ ప్రముఖులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.