తెలంగాణలో హంగ్ సర్కారు-కోమటిరెడ్డి జోస్యం
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని… ఏ పార్టీకి కూడా మెజార్టీ రాదని… తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ పార్టీ కూడా సొంతంగా 60 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ కలవక తప్పదన్నారు. మార్చి మొదటి వారం తాను పాదయాత్ర నిర్వహిస్తానన్న ఆయన… నేనే గెలిపిస్తా అంటే మిగిలిన వారు ఇంట్లో ఉంటారన్నారు. విభజన బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన ప్రసంగం నేపథ్యంలో రాష్ట్రంలో పొత్తులు ఉండవచ్చనే ప్రశ్నపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కేసీఆర్ పొగడటంపై స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండూ లౌకిక పార్టీలని కోమటిరెడ్డి అన్నారు.

