Home Page SliderNational

కుక్కల ఫైటింగ్‌లో మనుషుల కొట్లాట… రెండు నిండు ప్రాణాలు బలి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం పెంపుడు కుక్కల మధ్య గొడవ వాటి యజమానుల మధ్య ఘర్షణకు దారితీసింది. రెండు ప్రాణాలను బలితీసుకొంది. రాజ్‌పాల్ సింగ్ రజావత్ అనే బ్యాంక్ సెక్యూరిటీ గార్డు గత రాత్రి తన బాల్కనీ నుంచి పొరుగువారిపై కాల్పులు జరిపడంతో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. “రాజ్‌పాల్ సింగ్ రజావత్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పెంపుడు కుక్కల గురించి వాగ్వాదం కారణంగా ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాలనీలో తన లైసెన్స్ పొందిన తుపాకీతో కాల్పులు జరిపాడు” అని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అమరేంద్ర సింగ్ తెలిపారు. రాజావత్, అతని పొరుగు వ్యక్తి విమల్ అమ్చా (35) రాత్రి 11 గంటలకు కృష్ణా బాగ్ కాలనీలోని ఇరుకైన సందులో తమ కుక్కలతో నడుచుకుంటూ వెళుతుండగా, రెండు జంతువులు ఒకదానికొకటి దాడిచేసుకున్నాయి. వెంటనే, ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది, ఆ తర్వాత రజావత్ తన మొదటి అంతస్తులోని ఇంటికి పరిగెత్తుకు వెళ్లి… 12-బోర్ షాట్‌గన్‌ని ఉపయోగించి అమ్చాపై కాల్పులు జరిపాడు.

భయంకరమైన కాల్పుల వీడియోలో రాజావత్ షాట్‌గన్‌ని లోడ్ చేసి, దిగువ వీధిని లక్ష్యంగా చేసుకునే ముందు గాలిలో హెచ్చరిక షాట్‌ను కాల్చాడు. నగరంలో బార్బర్ షాప్ నిర్వహిస్తున్న అమ్చా, అతని బావ 27 ఏళ్ల రాహుల్ వర్మ అక్కడికక్కడే మృతి చెందారు. రాహుల్ వర్మ గర్భవతి అయిన భార్య జ్యోతి వర్మ కంటికి పెల్లెట్ గాయమైందని పోలీసులు తెలిపారు. గొడవ జరిగినప్పుడు వీధిలో ఉన్న మరో ఆరుగురికి కూడా బుల్లెట్ గాయాలు తగిలి ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రజావత్‌తో పాటు అతని కుమారుడు సుధీర్‌తో పాటు మరో బంధువు శుభమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు. గ్వాలియర్‌కు చెందిన రాజావత్‌కు లైసెన్స్‌ కలిగిన 12-బోర్ షాట్‌గన్ ఉన్నందున ఇండోర్‌లో సెక్యూరిటీ గార్డుగా ఒక ప్రైవేట్ సంస్థ నియమించుకుందని పోలీసులు తెలిపారు. ఈ హత్యలతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండు పోట్లాడుకునే కుక్కలు విమల్ అమ్చా ఇంట్లోకి ప్రవేశించి, వాటిని తరిమికొట్టడంతో గొడవ తీవ్రమైందని స్థానికులు పోలీసులకు తెలిపారు.