సుప్రీం కోర్టులో ఆప్‌కు భారీ విజయం
సుప్రీంకోర్టులో ఆప్‌కి భారీ విజయం లభించింది. నామినేటెడ్ సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు లేదని తేల్చి చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు… మేయర్‌ను నియమించే ఎన్నికల్లో ఓటు వేయరాదని సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. దేశ రాజధానికి మేయర్‌ను ఎన్నుకోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మధ్య ప్రతిష్టంభనకు సుప్రీం కోర్టు ఇవాళ ముగింపు పలికింది. మేయర్ పదవికి బీజేపీ నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా పౌర సంస్థను స్వాధీనం చేసుకోవాలని కమలం పార్టీ ప్రయత్నించిందని ఆప్ ఆరోపించింది. మేయర్ ఎన్నిక రెండు నెలల్లో మూడుసార్లు వాయిదా పడింది.

డిసెంబరులో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి జరిగిన ఎన్నికలలో AAP, BJP కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా నియమించిన కౌన్సిల్ సభ్యులు, ఆల్డర్మెన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రయత్నించారు. దీంతో AAP నిరసన వ్యక్తం చేసింది. సభలో గందరగోళం నెలకొంది. చివరకు ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. మేయర్‌ను ఎన్నుకున్న తర్వాతే డిప్యూటీ మేయర్ ఎంపికకు ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. ఒకసారి ఎన్నికైన మేయర్ సమావేశాలను నిర్వహిస్తారని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని ముందుగా మేయర్ ఎన్నిక జరగాలని… ఆ తర్వాత డిప్యూటీ ఎన్నిక కోసం జరిగే సమావేశాలకు మేయర్ అధ్యక్షత వహిస్తారని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ ఎలా చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాయో రుజువు చేసిందని మిస్టర్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. ఢిల్లీకి రెండున్నర నెలల తర్వాత మేయర్ పదవి దక్కనుంది. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ కలిసి చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులు ఎలా జారీ చేస్తున్నాయో ఇప్పుడు రుజువైంది. ‘ అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. డిసెంబర్లో జరిగిన MCD ఎన్నికలలో AAP స్పష్టమైన విజేతగా నిలిచింది. 134 వార్డులను గెలుచుకుంది. పౌర సంస్థలో BJP 15 సంవత్సరాల పాలనకు ముగింపు పలికింది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది.