నిన్న ఆనం, నేడు కోటం రెడ్డి… నెల్లూరు వైసీపీలో ముసలం
నెల్లూరు వైసీపీలో కల్లోలం రేగుతోంది. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తలపోటుతో చికాకుపడుతున్న వైసీపీకి తాజాగా నెల్లూరు రూరల్ తలనొప్పి మొదలయ్యింది. గత కొంతకాలంగా అటు ప్రభుత్వంపైనా, పార్టీపైనా విమర్శలు గుప్పిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జిల్లాలో పార్టీ వ్యవహారంపై నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి పార్టీ వీడుతున్నాడని… టీడీపీకి పోయేవాడు పోకుండా వైసీపీపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. నెల్లూరు రూరల్‌లో ఒకటి రెండు రోజుల్లో ఇన్‌చార్జిని నియమిస్తామన్నారు బాలినేని. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారన్నారు. ఫోన్ టాపింగ్ విషయంలో కావాలనే కోటంరెడ్డి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి రేపు బాధపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 10 స్థానాల్లో పార్టీ గెలుస్తుందన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలోనూ ఇన్ చార్జిని నియమించామన్నారు బాలినేని. మొత్తం వ్యవహారంపై రేపు సీఎం జగన్ వద్ద నెల్లూరు జిల్లా నేతలను సమావేశం కానున్నారు. జగన్‌తో భేటీ తర్వాత ఇన్‌చార్జి పేరు ప్రకటిస్తామన్నారు బాలినేని. నెల్లూరు పార్టీలో కలకలంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో బాలినేని సమావేశమయ్యారు.
