ప్రధాని బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు
◆ మూడు రాజధానులు ఆమోదానికి ప్రధాని చే ఒప్పించే ప్రయత్నాలు ?
◆ ప్రధాని సభను విజయవంతం చేసేందుకు వైసీపి కసరత్తు
◆ భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రధాన గ్రౌండ్లో ఈ నెల 12న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మోడీ పర్యటనను విజయవంతం చేయటానికి బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిశా నిర్దేశం చేశారు. రెండు రోజులు పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో పార్టీ పరంగా మోడీకి ఘనస్వాగతం పలికే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. అలానే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ కూడా ప్రధాని మోడీ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు మమ్మరం చేస్తుంది. పర్యటన నేపథ్యంలో ఎలా అయినా మూడు రాజధానులు ఆమోదానికి ప్రధానిని ఒప్పించే ప్రయత్నాలు వైసీపీ చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.

దాదాపుగా 11 వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటానికి విశాఖకు ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఆ సభను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని అందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు రావలసిన అవసరం ఉందని గ్రామస్థాయి నుంచి ఈ మేరకు పార్టీ నాయకులు కార్యకర్తలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వైసిపి పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారు. బీజెపి కంటే భారీ ఎత్తున జన సమీకరణకు వైసీపీ నే ఎక్కువగా కసరత్తులు చేయటం గమనార్హం. మోడీ సభను విజయవంతం చేసేందుకు ఇంత పెద్ద ఎత్తున సన్నాహాలు చేయటం వెనుక మూడు రాజధానుల విషయంలో ప్రధానమంత్రి చేత విశాఖపట్నంలో ఒక హామీ ఇప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నప్పటికీ ఒకపక్క కోర్టులో ఉన్న అడ్డంకులు ,మరోపక్క బీజేపీతో సహా అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తున్నడంతో పాటు కేంద్రం కూడా మూడు రాజధానుల బిల్లును ఆమోదించే విషయంలో ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం చెప్పకపోవడంతో తాజాగా ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు పై కేంద్రం కూడా ఆమోదించే విధంగా విశాఖపట్నంలో ప్రధాని చేత చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

రాష్ట్రంలో వైసీపీ బలాన్ని ప్రధాన మోడీ ముందు తెలియజేసేందుకు గాను భారీ సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విశాఖ సభకు జనాన్ని తరలించాలని వైసీపీ అధినేత ఉత్తరాంధ్ర జిల్లాల నేతలకు ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి సభకు అధిక సంఖ్యలో వాహనాలలో కార్యకర్తలను తరలించే ఏర్పాట్లలో ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన శాసనసభ్యులు, మంత్రులు నాయకులు నిమగ్నమయ్యారు.