ఏపీలో ఓటేసే హైదరాబాదీలెందురు? (Exclusive Report)
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి పెద్ద ఎత్తున ఓటర్లు వెళ్తారని అందరూ భావిస్తున్నారు. వీరందరూ ఈసారి ఏపీ ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఈ ఓటర్ల ఎవరికి ఓటేస్తారు? అభివృద్ధికి ఓటేస్తారా? సంక్షేమానికి ఓటేస్తారా? లేదంటే తమ కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు చెప్పినవారికి ఓటేస్తారా? ఇలాంటి ఎన్నో అంశాలు ఏపీ ఓటర్ల విషయంలో ప్రచారంలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఎందరు? డబుల్ ఓట్లు తీసేయగా మిగిలిన ఓటర్లు ఎవరికి పట్టంకడతారు?

హైదరాబాద్ లో నివశించే ఏపీ ఓటర్లకు విభజన ఒక అశనిపాతం. అయితే ప్రాంతాలుగా విడిపోయినా, హైదరాబాద్ లో కలిసిపోయేలా అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఏపీ, రాయలసీమ ప్రజలు జీవిస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏపీలో వాతావరణ ప్రభావం వల్ల గానీ, మొదట్నుంచి హైదరాబాద్ రాజధానిగా ఉండటం వల్ల గానీ, చాలా మంది సొంతూళ్లకు వెళ్లేకంటే హైదరాబాద్ లోనే ఉండాలన్న ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినప్పటికీ వారు హైదరాబాద్ లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయన్నది వారు నిరంతరం చర్చించుకుంటూనే ఉంటారు. గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ నివశించే ప్రజలు కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ పార్టీకి జైకొట్టారు. అంతెందుకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైనప్పటికీ గ్రేటర్ మొత్తం స్వీప్ చేసింది. అంటే ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చినా, రాకున్నా, హైదరాబాద్ లో సురక్షితంగా ఉన్నామన్న భావనతో ఎక్కువ మంది కారు పార్టీకి ఓటేశారు.

అయితే ఇప్పుడు ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పెద్ద ఎత్తున ఉత్కంఠ జరుగుతోంది. ఓవైపు ప్రచారం, మరోవైపు గ్రౌండ్ రియాల్టీలు ఎలా ఉన్నాయన్నదానిపై భిన్న వర్షన్లు ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో ఏపీపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. పార్టీలు, ఇక అభ్యర్థులు గెలవడం కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకొని హైదరాబాద్ లో ఉన్నవారిని తెప్పించడానికి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏపీ వాసుల ఓట్లపై రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే సమ్మర్ వెకేషన్ కూడా మొదలవడంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఏపీకి చేరుకున్నారు. ఏపీలో చాలా మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారని, అందరికీ వీకెండ్స్ సెలవులుంటాయన్న ప్రచారం జరుగుతున్నా.. హైదరాబాద్ లో ఏపీ జిల్లాల్లోంచి వచ్చి పనులు చేసుకునేవారిలో మెజార్టీ ప్రజలు కూలీనాలీ పనిచేసుకునేవారే. వారి జనాభా సుమారుగా 70 శాతానికి పైగా ఉంటుంది. ఐటీ, ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగుల కంటే పేదలు, మధ్యతరగతి ఓటర్లు గణనీయంగా ఉన్నారు.

ఏపీలో జగన్ సర్కారు ఏర్పడ్డాక డబుల్ ఓట్లపై ఆ పార్టీ ఈసీకి అనేక ఫిర్యాదులు చేసింది. చాలా నియోజకవర్గాల్లో డబుల్ ఓటర్లను ఏరివేయడంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఈసీకి సపోర్ట్ చేసింది. దీంతో రెండు చోట్ల ఓట్లున్నవారిని చాలా వరకు తొలగించారన్న వాదన ఉంది. వాస్తవానికి ఏపీ నుంచి హైదరాబాద్ లో స్థిరపడిన చాలా మందికి తెలంగాణలో మాత్రమే ఓట్లు ఉన్నాయి. మరి కొందరికి ఏపీలో మాత్రమే ఓట్లు ఉన్నాయి. కానీ కొందరికి రెండు చోట్ల ఓట్లుండటం విశేషం. గతంలో లాగా రెండు చోట్ల ఓట్ల ఉన్న బ్యాచ్ ఇప్పుడు పెద్దగా లేరని కూడా అధికారులు చెబుతున్నారు. డబుల్ ఓట్లను చాలా చోట్ల తీసేశారని కూడా చెబుతున్నారు. అయితే ఎన్ని ఓట్లు తొలగించారు? ఏ మేరకు ఏపీ ఓటర్లు ఓటేస్తారని దానిపై ఎంతో సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి హైదరాబాద్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండటంతో పెద్ద ఎత్తున రాయలసీమ ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఇక్కడ సెటిల్ అయిపోయారు. అదే సమయంలో చాలామంది హైదరాబాద్ లో సెటిలైనప్పటికీ… ఏపీలో ఓటు హక్కును కంటిన్యూ చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికీ హైదరాబాద్‌లో ఓటు రిజిస్టర్ చేసుకోలేదు. కొందరు కావాలని రెండు చోట్ల కూడా ఓటర్ ఓటు రిజిస్ట్ చేసుకున్నట్టు అధికారుల విచారణలో తేలింది.

2014లో ఏపీని అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబుకు ఓటేయాలన్న స్లోగన్ ప్రతిధ్వనించింది. 2019లో అది సన్నగిల్లగా.. ఈ సారి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ఓటేసేవారికి ఎలాంటి స్లోగన్ లేకపోవడం విశేషం. ఐతే ఏపీ నుంచి వచ్చే ఓటర్లు ఎంతమంది ఎన్నికల్లో పాల్గొంటారనేదానిపై పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. వాస్తవానికి ఏపీలో స్థిరపడిన తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు సంఖ్య సుమారుగా 20 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నా అవన్నీ కాకిలెక్కలేనని ఎన్నికల అధికారులు తేల్చి చెబుతున్నారు. ఆ నెంబర్ ఎంతన్నది చెప్పడమే కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ స్వీప్ చేయడానికి కారణం ఏపీ ఓటర్లేనన్న చర్చ ఉంది. ఏపీ ఓటర్లలో అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనలను సమర్థించే ఓటర్లు కూడా ఉన్నారు. ఏపీ విషయంలో వారి మధ్య భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం కేసీఆర్ ను సపోర్ట్ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వారందరూ ఎవరి పార్టీకి వారు ఓటేసుకుంటారని కూడా తెలుస్తోంది.

