Home Page SliderNational

కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హార్దిక్ పాండ్యా

మనుషుల వ్యక్తిత్వాలు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే బయపడతాయంటారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొందరు అద్భుతాలు సృష్టిస్తారు. కొందరు లభించని అవకాశాల కోసం వెంపర్లాడుతుంటారు. ఇప్పటి వరకు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అటు బంతితోనూ, ఇటు బాట్‌తోనూ సత్తా చాటి అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. అయితే ఇవాళ తాను మాట్లాడిన ఒక్క మాటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లో మీరు ఆడతారా అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు హార్దిక్. అసలు టెస్ట్ జట్టులో స్థానమే తనకు లేదని.. అలాంటప్పుడు ఫైనల్స్ ఎలా ఆడతానంటూ ప్రశ్నించాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ సమరానికి ముందు ఇండియా, ఆస్ట్రేలియాతో వన్డే సీరిస్‌లో తలపడుతున్నాయి. జూన్‌లో లండన్‌లోని ఓవల్‌లో మ్యాచ్ జరగనుంది. 2021-2023 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, రెండో ఎడిషన్ 4 ఆగస్టు, 2021న ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జూన్ 7-11 తేదీల్లో జరగనుంది. ఐతే ఆగస్ట్ 2018 నుండి భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడని హార్దిక్ పాండ్యాను ఫైనల్‌ మ్యాచ్ ఆటడం గురించి ప్రశ్నకు గడుసైన సమాధానం ఇచ్చాడు. తాను టెస్ట్ జట్టులో సభ్యుడిని కానందున… ఫైనల్ సమరం ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం ‘నైతికం’ కాదన్నాడు. తాను జట్టులో ఉండబోనని తేల్చి చెప్పాడు.

ఐతే ఆట తీరును మెరుగుపరచుకొని తాను టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకుంటానన్నాడు పాండ్యా. టెస్ట్ సీరిస్‌లో చోటు దక్కించుకోవడం కోసం తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నాడు. కనీసం పది శాతం కూడా టెస్ట్ చోటులో స్థానం కోసం శ్రమించలేదన్నాడు. ఇప్పటికే జట్టులో చోటు దక్కించుకున్న… మరొకరి స్థానంలో తాను ఆడాలని కోరుకోవడం దారుణమన్నాడు. నైతికత అన్పించుకోదన్నాడు. తాను జట్టులో చోటు దక్కించుకోవడానికి ఒక్క శాతం కూడా ఛాన్స్ లేదన్నాడు. జట్టులో చోటు లభించినప్పుడు మాత్రమే టెస్ట్ సీరిస్‌ల్లో పాల్గొంటానన్న పాండ్యా… WTC ఫైనల్లో తాను ఆడబోనని తేల్చి చెప్పాడు.

హార్దిక్ 11 టీ 20ల్లో ఇండియాకు నేతృత్వం వహిస్తే 7 మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించింది. ఐతే టెస్టు జట్టులో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా మొదలైన సీనియర్ ఆటగాళ్లు ఉండటంతో తాను టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉందని పాండ్యా చెబుతున్నాడు. ముందుగా వన్డేల్లో బాగా ఆడటం ద్వారా తనకు అవకాశలొస్తాయని భావిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ అవసరాల రీత్యా ఇవాళ జట్టుకు నాయకత్వం వహించకపోవడంతో… జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎథికల్‌గా తనకు టెస్ట్ ఫైనల్లో ఆడే అవకాశం లేదన్నాడు. రెండో, మూడో వన్డేలో రోహిత్ శర్మ తిరిగి భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు.