కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలకు మొత్తం తెలుసునన్నారు గవర్నర్ తమిళిసై. కేసీఆర్ సర్కారు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందన్నారు. ప్రభుత్వ తీరు చరిత్రలో ఎన్నటికీ నిలిచే ఉంటుందన్నారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరక్కుండా చేయాలని ప్రభుత్వం భావించిందని.. ఆమె పుదుచ్చేరిలో అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ఆమె కేసీఆర్ సర్కారు తీరును తప్పుబట్టారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడం వల్ల గణతంత్ర వేడుకలు చేయాల్సి వచ్చిందన్నారు. రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని రెండు నెలల క్రితమే లేఖ రాస్తే… రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని రెండు రోజుల క్రితం సమాచారమిచ్చారని ఆమె విమర్శించారు. కేంద్రం ఇస్తున్న సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని… గవర్నర్ ప్రసంగ పాఠాన్ని పంపించలేదని దుయ్యబట్టారు.

