గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు
అమరావతి :గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పనపై ఏపీ ప్రభుత్వం కదలికలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సమగ్ర అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని (కేబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
10 మంది మంత్రులతో ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు అచ్చెన్నాయుడు, అనిత, నారాయణ, డీఎస్‌బీవీ స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశాన్ని లోతుగా పరిశీలించాలని ఈ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఇంటర్‌మీడియేటరీ పోస్టుల సృష్టిపై చర్చించడంతో పాటు, అవసరమైతే కొత్త పోస్టులకు పే స్కేల్ నిర్ణయించడంపై కూడా సూచనలు ఇవ్వాలని ఆదేశించింది.
అదేవిధంగా, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ప్రమోషన్ ఛానల్ విధానాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేయాలని, వాటి ఆధారంగా సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను రూపొందించాలని సూచించింది. పదోన్నతులు అమల్లోకి వచ్చిన తర్వాత ఖాళీలు భర్తీ చేసే విధానంపై కూడా చర్చించాల్సిందిగా కమిటీని కోరింది.
వీలైనంత త్వరగా పూర్తి అధ్యయనం చేసి, స్పష్టమైన సిఫార్సులతో నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఈ చర్యతో సచివాలయ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తగా, పదోన్నతుల మార్గం ఎప్పుడు తెరుచుకుంటుందనే అంశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.