Andhra PradeshHome Page Slider

ఆంధ్రాలో ఆటల పండుగ- ఆడుదాం ఆంధ్ర

గ్రామ స్థాయి నుండి క్రీడలకు సమున్నత ప్రోత్సాహం

భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్‌ టీం ఉండేలా లక్ష్యం

46 రోజుల పాటు రాష్ట్రంలో “ఆడుదాం ఆంధ్ర”

‘‘ఆడుదాం ఆంధ్ర’’ పేరుతో 46 రోజుల పాటు రాష్ట్రంలో క్రీడా సంబురాలు

ఏపీలో క్రీడలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి సీఎం జగన్ నడుం బిగించారు. ఆంద్రప్రదేశ్‌లో ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులు ఉన్నారని, వారిని పైకి తీసుకురావాలని అధికారులను సూచించారు.  దీనికోసం సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ జి వాణీమోహన్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఎస్‌ఎఎపీ) ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ వీసీ అండ్‌ ఎండీ కె హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రామ స్థాయి నుండి క్రీడలకు సమున్నత ప్రోత్సాహం

  గ్రామస్థాయి నుంచి నైపుణ్యవంతమైన క్రీడాకారులను తయారు చేసేలా అధికారులు, క్రీడా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. తొలుత జిల్లా స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌గా క్రికెట్‌ ఆడించే పరిస్థితి రావాలని సీఎం ఆకాంక్షించారు. ఇక క్రీడాపోటీల నిర్వహణకు ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు

ఏపీకి కూడా ఒక ఐపీఎల్ జట్టును తయారుచేయాలి

ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్‌ జట్టు ఉండేలా అందులో ఆంధ్రా ఆటగాళ్లు ఎక్కువమంది ఉండేలా ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజిమెంట్‌ ఆధ్వర్యంలో మూడు క్రికెట్‌ స్టేడియాల్లో క్రికెటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం వివరించారు. దీనివల్ల ఆటగాళ్లలో ప్రొఫెషనలిజం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని యువకులకు.. క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్‌.భరత్‌ వంటి వారు స్ఫూర్తిదాయకులని సీఎం జగన్‌ అన్నారు. వారి సేవలను కూడా వినియోగించు కోవాలని ఆయన సూచించారు.

ఈ విభాగాల్లో క్రీడా పోటీలు..

రానున్న రోజుల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖో–ఖో వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాలురు, బాలికలు ఈ క్రీడల్లో పాల్గొనేలా చూడాలన్నారు. దీంతోపాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు ఉండాలన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర ‘ అనే పేరుతో 46 రోజులపాటు ఆటల పోటీలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల మైదానాలు, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, యూనివర్సిటీ మైదానాలను వినియోగించుకోవాలన్నారు.