తెలంగాణ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల, శేరిలింగంపల్లిపై నో క్లారిటీ
బీజేపీ తెలంగాణ నాలుగో జాబితాను విడుదల చేసింది. 12 పేర్లతో తాజాగా జాబితా విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో చెన్నూరు (ఎస్సీ) నుంచి అశోక్, ఎల్లారెడ్డి నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమ, హుస్నాబాద్ నుంచి బొమ్మా శ్రీరాం చక్రవర్తి, సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నుంచి పెద్దింటి నవీన్ కుమార్, కొడంగల్ నుంచి బంతు రమేష్ కుమార్, గద్వాల్ నుంచి బోయ శివ, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాస్, మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, నకిరేకల్ నుంచి నకరకంటి మొగలయ్య, ములుగు (ఎస్టీ) నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ కు పార్టీ అవకాశం కల్పించింది. మరో 19 సీట్లకు సంబంధించి క్లారిటీ రేపటి లోగా వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 8 సీట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో మరో 11 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేనతో పొత్తు విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటుగా, గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలపై క్లారిటీ రావాల్సి ఉంది. శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ముఖ్యనేతలు గజ్జల యోగానంద్, రవికుమార్ యాదవ్ విశ్వప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక వేములవాడ నుంచి తుల ఉమకు పార్టీ టికెట్ కేటాయించడం సంచలనంగా చెప్పాల్సి ఉంది. ఇక్కడ్నుంచి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ హైకమాండ్ తుల ఉమ వైపు మొగ్గు చూపింది. తుల ఉమ మొదట్నుంచి ఈటల రాజేందర్ మద్దతుదారుగా ఉన్నారు.

