టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి!
తెలంగాణ ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ కసరత్తు వేగవంతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) అధ్యక్షుడిగా రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆమోదం కోసం గవర్నర్‌కు పంంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్, మరియు సభ్యులను యుద్ధ ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ బుధవారం రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పేరును ఖరారు చేసింది. చీఫ్ సెక్రటరీ ఎ. శాంతి కుమార్, లా సెక్రటరీ తిరుపతి, జీఏడీ సెక్రటరీ నిర్మలా దేవిలతో కూడిన సెర్చ్ కమిటీ సోమవారం కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించింది. TSPSC చైర్‌పర్సన్ పదవికి 50 దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. కమిషన్ గత వైభవాన్ని సంతరించుకునేలా… మాజీ డీజీపీని నియమించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

ఒక పేరునే షార్ట్‌లిస్ట్ చేసి… ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. గవర్నర్ పేరును క్లియర్ చేసిన తర్వాత, ఇతర సభ్యుల ప్యానెల్ ఆమోదం కోసం పంపించే అవకాశం ఉంది. ప్రశ్నపత్రం లీక్ ఘటనతో టీఎస్పీఎస్సీ గతంలో ఎన్నడూ లేనంతగా అప్రదిష్టపాలయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపింది. B. జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని TSPSC గ్రూప్-1, గ్రూప్-II పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురయ్యింది. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనప్పటికీ, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఓటమిలో యువత కూడా కీలక పాత్ర పోషించారన్న భావన ఉంది. దీంతో టీఎస్పీఎస్సీ వ్యవహారం ఎన్నికల్లో కీలకమైంది. దీంతో కమిషన్‌ను పూర్తి స్థాయిలో నియమించి, యువతకు భరోసా కలిగిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను జనవరి 10న మాత్రమే ఆమోదించారు. రాజీనామాలు ఆమోదం పొందక ముందే, చైర్‌పర్సన్, సభ్యుల పదవులకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల సమర్పణకు జనవరి 18 చివరి రోజు. టీఎస్‌పీఎస్సీ చీఫ్ పోస్టుకు 50, ఇతర సభ్యుల కోసం 321 సహా 371 దరఖాస్తులు వచ్చాయి. పదవీ విరమణ పొందిన బ్యూరోక్రాట్‌ల నుండి వివిధ రంగాలకు చెందిన విద్యావేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో నియామకాలు అత్యంత కీలక అంశం. ఆ అంశాన్ని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో ఇప్పుడు అదే అంశాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి… తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.