NationalNews

కాంగ్రెస్ పార్టీ నాశనానికి పంచ కారణాలు-ఆజాద్

కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసిన ఐదు సూత్రాలను కుండబద్కుల్లా కుల్లాగా వివరించారు గులాం నబీ ఆజాద్…

  1. రాహుల్ గాంధీ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతా ఆగమాగమయ్యిందన్నారు ఆజాద్. రాహుల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి అంటే జనవరి 2013 తర్వాత అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం చర్చల ప్రక్రియను రాహుల్ గాంధీ సర్వనాశనం చేశారంటూ ఆజాద్ ఐదు పేజీల లేఖలో పేర్కొన్నారు.

2. రాహుల్ గాంధీ పరపక్వతకు నిదర్శనం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను మీడియా ముందుకు వచ్చి చించేయడమేనన్నారు ఆజాద్.. రాహుల్ గాంధీకి ఎక్కడ ఎలా వ్యవహరించాలన్నది కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

3. మితవాద శక్తుల ప్రచారానికి, కొన్ని కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కలగలిసిపోవడం యూపీఏ పతనానికి కారణమన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ చైల్డిష్ ప్రవర్తన… భారత ప్రభుత్వాన్ని, ప్రధాని అధికారాన్ని పూర్తిగా తలకిందులు చేసిందన్నారు. ఈ పరిణామాలన్నీ 2014లో యూపీఏ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడిపోడానికి కారణమయ్యాయన్నారు ఆజాద్.

4. 2014 తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రెండు లోక్‌సభ ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓడిపోయిందన్న ఆజాద్… 2014 – 2022 మధ్య జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికలలో 39 చోట్ల చిత్తు చిత్తయ్యిందని దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. పార్టీ కేవలం నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిందని… ఆరు రాష్ట్రాల్లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు అవకాశం మాత్రమే పొందిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండగా… రెండు రాష్ట్రాల్లో మైనర్ సంకీర్ణ భాగస్వామిగా ఉందన్నారు ఆజాద్.

5. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పదవిలోంచి దిగిపోయిన తర్వాత… పార్టీ కోసం ప్రాణాలను అర్పించిన సీనియర్ కార్యకర్తలను… పార్టీ కార్యవర్గ సమావేశంలో అవమానించడం కలచివేసిందంటూ ఆజాద్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ తాత్కాలిక అధ్యక్షులుగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించినా పరిస్థితులు మరింత దిగజారాయన్నారు. గత మూడేళ్లుగా కొనసాగిస్తున్న పదవి.. యూపీఏ ఫీలింగ్ లేకుండా చేశాయన్నారు. నాడు యూపీఏ సర్కారు సమగ్రతను కూల్చివేసిన ‘రిమోట్ కంట్రోల్ మోడల్’ ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్‌కు వర్తింపజేశారని… దీంతో కాంగ్రెస్ పార్టీ కూనరిల్లుతోందన్నారు ఆజాద్. సోనియా గాంధీ కేవలం నామమాత్రపు వ్యక్తి అయితే, అన్ని ముఖ్యమైన నిర్ణయాలను రాహుల్ గాంధీ తీసుకుంటున్నారా… లేదా అతని సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత సహాయకులు తీసుకుంటున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆజాద్.