278 మందితో ఫస్ట్‌బ్యాచ్ ‘ఆపరేషన్ కావేరీ’ ప్రారంభం -శ్రీలంకకు కూడా చేయూత
సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కు రప్పించే భాగంగా ఈ ‘ఆపరేషన్ కావేరీ’ మొదలయ్యింది. సుమారు 278మందితో కూడిన బృందాన్ని భారత్‌కు తరలిస్తున్నారు. వీరు ఐఎన్‌ఎస్ సుమేధా నౌక ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేరుకుంటారు. అనంతరం భారత్ చేరుకుంటారు.

సూడాన్‌లో మూడురోజుల పాటు కాల్పుల విరమణను ప్రకటించారు. దీనితో అన్ని దేశాలు అక్కడ చిక్కుకున్న తమ పౌరులను రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అంతేకాదు. శ్రీలంక దేశస్థులను కూడా సూడాన్ నుండి తరలించేందుకు సహకరిస్తోంది భారత్. దీనితో శ్రీలంక భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంది. భారత్ సాయంతో తమ పౌరులను తిరిగి శ్రీలంకకు తీసుకురాగలమని ఆశాభావం వ్యక్తం చేసింది.

సూడాన్ దేశ మిలటరీలో ఏర్పడిన వర్గాల మధ్య ఆధిపత్య పోరాటంలో ఇప్పటికే 250 మంది మరణించారు. 2600 మంది క్షత్రగాత్రులయ్యారు. ఈ పోరాటంలో సూడాన్ ఆర్మీ,రాపిడ్ సపోర్ట్ ఫోర్సుల మధ్య జరుగుతోంది. ఈ పోరాటం క్రమంగా ప్రజలమధ్య దేశవ్యాప్తంగా అంతర్యుద్ధానికి దారితీసింది. దీనితో అన్ని దేశాలు వారి దేశ పౌరులను అక్కడి నుండి రప్పించే ఏర్పాట్లలో పడ్డాయి.