Andhra PradeshHome Page Slider

ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అడుగులు క్రమ క్రమంగా కీలకంగా మారుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేసిన నాటి నుంచి కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చుట్టూ వచ్చు బిగుస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా మూడోసారి ఎంపీకి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు అవినాష్ ను విచారించిన సిబిఐ సంతృప్తి చెందలేదు. దీంతో మళ్లీ ఆయనను ప్రశ్నించనుంది. దీనిలో భాగంగానే ఈనెల ఆరో తేదీ సోమవారం హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు తాజాగా నాటీసులు జారీ చేశారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. మరోవైపు తన తండ్రి భాస్కర్ రెడ్డి కి కూడా సిబిఐ అధికారుల నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే రెండుసార్లు విచారణకు రావాలంటూ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణ జరగలేదు. వివిధ కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్న తరుణంలో కొద్దిరోజుల క్రితం ఈనెల 12వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అవినాష్ రెడ్డి తో పాటు తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా ఒకేసారి నోటీసులు జారీ చేశారు. ఈయన కూడా ఈ నెల 6వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయానికి పిలవగా తండ్రి భాస్కర్ రెడ్డిని మాత్రం కడప కేంద్ర కారాగారం అతిధి గృహంలో విచారణ కావాలని నోటీసుల్లో సిబిఐ పేర్కొంది. ఈ మేరకు పులివెందులకు వెళ్లిన అధికారులు తండ్రి కుమారులు ఇద్దరిని ఆరో తేదీ ఒకేరోజు విచారణకు పిలవటం పట్ల రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

కాగా సిబిఐ ఆదేశించినట్లుగా ఈసారి విచారణకు ఆరో తేదీ సోమవారం హాజరు కాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. ఇదే విషయాన్ని సిబిఐ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సిబిఐ కి లేఖ కూడా రాశారు. గత విచారణ సందర్భంగా మళ్ళీ ఎప్పుడు రావాలని మాత్రం చెప్పలేదని అవినాష్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ అధికారులు పులివెందుల చేరుకొని కనీసం టైం ఇవ్వకుండా సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో తనకు ఉన్న పనుల కారణంగా విచారణకి హాజరు కాలేనని అవినాష్ రెడ్డి చెప్పినా… సిబిఐ అధికారులు వినకపోవడంతో తనకు సమయం కావాలని కోరుతూ అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.