ఫైనల్ వార్నింగ్.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఝలక్
తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పద్దతి మార్చుకోండి. మారండంటూ హితవు పలికారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రస్ రిపోర్ట్స్ తన వద్ద ఉన్నాయన్నారు. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధులో 2 నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారని, ఎమ్మెల్యేల అనుచరులు ఆ మొత్తం తీసుకున్నా.. అది ఎమ్మెల్యేలపైకే వస్తోందని తేల్చి చెప్పారు. అలా వసూళ్లు చేస్తున్న ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలుసునన్నారు.
ఎమ్మెల్యేల తాజా పరిస్థితిపై సర్వే వివరాలను కేసీఆర్ వివరించారు. కొందరు నేతలు నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలని హితవు పలికారు. మంచిగా పనిచేసుకొని తిరిగి గెలవాలన్నారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానన్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చురకలంటించారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులు పనితీరును వివరించారు. ఎవరు మార్చుకోవాలో చెప్పారు.
సర్వేల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలు, రెండు నెలల్లో గ్రాఫ్ పెంచుకోవాలన్న కేసీఆర్, అలా కాకుంటే వచ్చే రోజుల్లో టికెట్ రాదని స్పష్టం చేశారు. పనితీరు బాలేని ఎమ్మెల్యేలను రిప్లేస్ చేస్తానని చెప్పారు. మరోసారి అధికారంలోకి రావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఢీకొట్టాలంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఎంపీలకు సైతం నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉంటాలని కేసీఆర్ స్పష్టం చేశారు.